Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లాలో 29,949 దరఖాస్తులు
- ఆమోదం పొందినవి 10 శాతం దరఖాస్తులే
- అధిక సంఖ్యలో దరఖాస్తుల తిరస్కరణ
- పూర్తయిన డిజిటల్స్ సంతకాలు
- పాస్ పుస్తకాల పంపిణీ కసరత్తు
- అధికార ప్రకటనే తరువాయి
నవతెలంగాణ- మిర్యాలగూడ
ప్రభుత్వ భూములు సాగు చేసుకుని జీవన సాగిస్తున్న పేద గిరిజనులకు పోడు భూముల కింద పాసుపుస్తకాలు ప్రభుత్వ అందించనుంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటు కబ్జాలో ఉన్నవారికి నిజమైన అర్హులను గుర్తించి వారికి పాసుపుస్తకాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పోడు భూముల సాగు చేసుకుంటున్న వారికి పట్టాలిస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గతంలో వామపక్షాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేశారు. వాపక్ష నేతలు అనేకమార్లు ప్రభుత్వ దష్టికి మంత్రుల దష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్తో వాపక్షాలు పొత్తు కుదరడంతో ఆ సమయంలో ప్రధానంగా పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టికి తీసుకెళ్లారు. దాని అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములపై సర్వే నిర్వహించారు. ప్రభుత్వ భూములు కబ్జాల ఉండి సాగు చేసుకుంటున్నా పేద గిరిజనులను గుర్తించాలని ఆదేశించారు. దీనికి గాను మండల స్థాయిలో తాసిల్దార్ నేతత్వంలో ఒక కమిటీ వేసి సర్వే చేశారు. వచ్చిన దరఖాస్తుల ను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నిజమైన గుర్తించి ఉన్నత అధికారులకు నివేదిక పంపించారు. త్వరలోనే వీరందరికీ పోడు పట్టాలు అందనున్నాయి. వెంటనే పాస్ పుస్తకాలు కూడా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికిగాను డిజిటల్ సంతకాలు కూడా పూర్తయినట్లు జిల్లా అధికారి ఒకరు నవతెలంగాణ కు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పోడు భూముల రైతులకు పట్టాలు అందించేందుకుగాను దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలో 29, 949 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 20,446 దరఖాస్తులు రాగా, సూర్యాపేట జిల్లాలో 7,373 దరఖాస్తులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2130 దరఖాస్తులు వచ్చాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా మిర్యాలగూడ డివిజన్లో 12,337 దరఖాస్తులు వచ్చాయి.
ఉమ్మడి జిల్లాలో 20 మండలాల్లో పోడు భూములు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 20 మండలాల్లో పోడు భూములు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పేద గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నట్లు గుర్తించి దరఖాస్తులు స్వీకరించి సర్వే చేపట్టారు. ఇందులో నల్గొండ జిల్లాలో 13 మండలాలు అడవిదేవులపల్లి, చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, మిర్యాలగూడ, నేరేడుగొమ్మ, నిడమనూరు,, పీఏ పల్లి, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 119 గ్రామపంచాయతీలు 160 ఆవాసాలు ఉన్నాయి. మొత్తం 55,702 ఎకరాలు పోడు భూములు ఉన్నాయి. దీనికి 20,446 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా మిర్యాలగూడ డివిజన్లో 10,046 మంది గిరిజన రైతులు, 2291 మంది ఇతర రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వీటి పరిధిలో 33,276 ఎకరాల భూమి ఉన్నది. సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం, మట్టంపల్లి, మేళ్లచెరువు, పాలకీడు మండలాలున్నాయి. 20,503 ఎకరాలకు గాను 7372 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కపల్లి, నారాయణపుర్, చౌటుప్పల్ మండలాల్లో 6133 ఎకరాలకు గాను 2130 దరఖాస్తులు వచ్చాయి.
10 నుంచి 20 శాతం దరఖాస్తులకే ఆమోదం
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులలో కేవలం 10 నుంచి 20 శాతం దరఖాస్తులకే అధికారులు ఆమోదం తెలిపినట్లు సమాచారం. వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పటికీ సమగ్రంగా విచారణ జరపలేదని ఆరోపణలు ఉన్నాయి. పేద గిరిజన రైతులు కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న ఏదో ఒక సాకు కారణంగా వారిని అనర్హులుగా గుర్తించినట్లు విశ్వసినీయ సమాచారం. నల్గొండ జిల్లాలో కేవలం 20% దరఖాస్తులకే ఆమోదం తెలుపగా మిగిలిన జిల్లాలో 10శాతం మాత్రమే ఆమోదం తెలిపినట్లు సమాచారం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్లో 2097 మంది దరఖాస్తులను 1327 ఎకరాలకు ఆమోదం తెలిపి ఎఫ్ఆర్సికి నివేదిక పంపినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో 5,575.35 ఎకరాలకు గాను 2262 మంది రైతుల దరఖాస్తులను ఆమోదించినట్లు తెలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం కేవలం 200 పై చిలుకు దరఖాస్తులకు మాత్రమే ఆమోదం పొందినట్లు సమాచారం. మిగిలిన దరఖాస్తులపై సమగ్రంగా విచారణ జరిపి అర్హులైన పేదలందరికీ పట్టాలు పాసుబుక్కులు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు
పట్టాలు, పాసుబుక్కులు పంపిణీకి కసరత్తు
పోడు భూముల రైతులకు పట్టాలు పాస్ పుస్తకాలు అందించేందుకు అధికార యంత్రం కసరత్తు చేపట్టింది. ఇప్పటికే సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించగా వారి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. లబ్ధిదారులకు పట్టాలు పాస్ పుస్తకాలు అందించేందుకు అంత సిద్ధం చేశారు. పట్టాలు పాస్వర్చుకాలపై ఉన్నతాధికారుల డిజిటల్ సంతకాలు పూర్తయినట్లు తెలిసింది. వాస్తవానికి ఈనెల ఆరో తేదీన పట్టాలు పాస్ పుస్తకాలు ఇవ్వాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం నుండి సూత్రప్రాయంగా ఆదేశాలు అందడంత ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారిక ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
మిగిలిన దరఖాస్తులను కూడా సమగ్రంగా విచారించాలి
వీరేపల్లి వెంకటేశ్వర్ల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు
పోడు భూముల రైతులకు పట్టాలు ఇచ్చే విషయంలో అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టలేదు. వచ్చిన దరఖాస్తులలో అతి తక్కువ దరఖాస్తులకే ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఎన్నో ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకున్న రైతులకు వివిధ కారణాల చేత అనర్హులుగా ప్రకటించడం సరిదికాదు. తిరస్కరించిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించాలి. చిన్నచిన్న కారణాలకు మినహాయింపు ఇచ్చి వారందరినీ కూడా అర్హులుగా గుర్తించి పట్టాలు పాసుపుస్తకాలు ఇవ్వాలి. సాగు చేసుకుంటున్న రైతులందరికీ అర్హులుగా గుర్తించాలి.