Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనఊరు- మన బడి ఇదేనా...?
- ఆక్రమణకు గురైన ప్రభుత్వ పాఠశాల
- మల్లవానికుంట తండాలో మూడేండ్లుగా మూతపడిన స్కూల్
- పెంట దిబ్బలు, గడ్డివాములు వేసిన ఆక్రమణ దారులు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర మండలంలోని నీమానాయక్ తండా పంచాయతీ పరిధిలోని మల్లవాని కుంట తండా గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలను కొందరు ఆక్రమించారు. ఈ పాఠశాలను 30 ఏండ్ల క్రితం నిర్మించారు. గత మూడేళ్ల కింద వరకు ఇక్కడే తరగతులు నిర్వహించారు. లాక్ డౌన్ తరువాత కూడా ఇక్కడ ఒక ఉపాద్యాయులు పని చేస్తూ పాఠశాల సజావుగా సాగింది. గత రెండేళ్లుగా చదువుకోవడానికి విద్యార్థులు రాకపోవడంతో పాఠశాల తాళాలకే పరిమితమయింది. దీంతో ఇదే అదునుగా చేసుకొని పాఠశాలను అక్రమించుకున్నారు గ్రామానికి చెందిన కొందరు. ఒకవైపు మనఊరు మనబడి కార్యక్రమంలో పాటశాలలను అభివృద్ధి పరచి, ప్రతిగ్రామంలో స్కూల్ నడిచేలా చూస్తుంటే మరో వైపు గ్రామాల్లో ఎన్నో ఏండ్లుగా ఉన్న పాఠశాలలను అక్రమించుకుంటున్నా సంభందింత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. పాఠశాల ప్రాంగణంలోనే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉంది. పాఠశాల నడవక పోవడంతో ఈ పాఠశాల స్థలం మాదేనంటూ గ్రామానికి చెందిన కొంతమంది పెంటదిబ్బలు, గడ్డివాములు వేశారు. దీంతో అక్కడ
కంప చెట్లతో నిండి పోయింది. చిన్న తండా కావడంతో పెంట దిబ్బల వాసన భరించలేక పోతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ని వివరణ కోరగా వాళ్ళకీ ఎన్నిసార్లు చెప్పిన వినడం లేదని చెప్పారు. సంబంధిత అధికారులు పెంటదిబ్బలు, కంప చెట్లు తోలగించి దుర్వాసన రాకుండా చూడాలని, పాఠశాలలో పెంట దిబ్బలు పోసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం:బాలునాయక్(ఎంఈఓ)
గత మూడేళ్ళుగా విద్యార్థులు రాక పోవడంతో స్కూల్ మూత పడింది. అక్కడి టీచర్లను వేరే స్కూలుకు పంపాము. ఖాళీ గావుండడంతో అక్కడ కొంత మంది దిబ్బలు, గడ్డివాములు వేశారు. వాటిని తొలగించి శుభ్రం చేస్తాం. గత ఏడాది టీచర్ను పంపితే పిల్లలను ఎవరు పంఫలేదు. వచ్చే జూన్ నుంచి పాఠశాల టీచర్ను కేటాయించి తెరిచే విదంగా చర్యలు తీసుకుంటాం.