Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వథాగా పడిఉన్న ఇండ్లు
- మౌలిక వసతులు కరువు
- పంపిణీకి నోచుకోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
పేదోడి సొంతింటి కల నెరవేర్చాలని ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. 2014 లో అధికారం చేపట్టిన ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి కుటుంబానికీ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారు. అందులో భాగంగా నియోజకవర్గాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. ఒక్కో నియోజవర్గంలో 1400 నిర్మించాలని దానికి అవసరమైన నిధులు కూడా విడుదల చేశారు. పట్టణ మండల కేంద్రాలతో పాటు ప్రధానమైన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. కొన్నిచోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి ఎదురుచూస్తుండగా ,మౌలిక వసతుల్లేేక మరికొన్ని చోట్ల ఇండ్లు వథాగా పడి ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా పంపిణీకి నోచుకోకపోవడంతో ఆ ఇండ్లు శిథిలాస్థకు చేరుకున్నాయి. మరి కొన్ని చోట్ల స్థల సేకరణ చేశారే తప్ప ఇండ్ల నిర్మాణాలు చేపట్టలేదు. మరికొన్ని మండలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఊసే లేదు. నిర్మాణాలు పూర్తయిన చోట ఇండ్ల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. లబ్దిదారుల ఎంపిక ప్రభుత్వ ఆదేశానుసారం చేపట్టాలని అధికారులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయం నాటికి ఇల్లు నిర్మించిన చోట పేదలకు అందజేస్తారని ప్రచారం ఉన్న ఆయన వెంటనే పేదలకు పంచాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉమ్మడి నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. ప్రధానంగా పాత మున్సిపాలిటీ ప్రాంతాలలో ఇల్లు నిర్మించి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ,చౌటుప్పల్, దేవరకొండ, హాలియా ,తుంగతుర్తి మండల కేంద్రాల్లో ఇప్పటికే ఇండ్లు నిర్మిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 8155 నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలోనూ 1400 చొప్పున నిర్మించాలని నిధులు విడుదల చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 2682 పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్నవి 700, ప్రారంభం కానివి సుమారు 4700 ఉన్నాయి. ఇప్పటివరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 210 మంది లబ్దిదారులకు ఇండ్లు అందజేశారు. మార్చి 31 వరకు 2400 ఇండ్లను పంపిణీ చేసే అవకాశం ఉంది. నల్లగొండ పట్టణంలో గొల్లగూడలో 560 ఇండ్లు నిర్మిస్తున్నారు. మిర్యాలగూడలోని ఇండిస్టియల్ ఏరియాలో 540 నిర్మించారు. జి ప్లస్-2 గా ఇండ్లు నిర్మించారు. అక్కడ రోడ్లు, డ్రెయినేజీ, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యాలు లేకపోవడంతో పంపిణీ చేయలేదు. మౌలిక వసతులు కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. కనీస సౌకర్యాలు ఏర్పడిన తర్వాత ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. లబ్దిదారుల వివరాలు వివిధ మండల తహసీల్దార్ల వద్ద లభిస్తుంది. మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.
సూర్యాపేట జిల్లాలో....
సూర్యాపేట జిల్లాలో నియోజకవర్గాల వారిగా మొత్తం 5,424 ఇండ్లను మంజూరు చేయగా 4,264 ఇండ్ల నిర్మాణానికి అధికారులు గుత్తేదారులను టెండర్లకు ఆహ్వానించారు. మొదటి విడతగా 2015లో 1,698 ఇండ్లు, రెండవ విడత 2016 సంవత్సరంలో 2,566 ఇండ్ల టెండర్లు ఖరారు అయ్యాయి. ఈ ఇండ్ల నిర్మాణాలకు మొదటి విడత రూ. 85.54 కోట్లు, రెండవ విడత 79.94 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తూ వస్తోంది. సూర్యాపేట నియోజకవర్గంలో రెండు విడతల్లో 1,900 ఇండ్ల నిర్మాణానికి గానూ మొదటి విడతలో చేపట్టిన నిర్మాణాలు పూర్తి కావడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్లబజార్‌లో 192, పెన్‌పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెం గ్రామంలో 102, చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో 80 ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేసి అధికారులు పంపిణీ చేశారు. కోదాడ నియోజకవర్గంలోని మొదటి విడతలో 400 ఇండ్లు నిర్మాణం చేపట్టగా, చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో 40 ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో 274, హుజూర్నగర్ నియోజకవర్గంలో 240 ఇండ్లు నిర్మించినా పంపిణీకి నోచుకోలేదు. 2016 సంవత్సరంలో మొత్తం 2,566 ఇండ్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు కాగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సూర్యా పేట నియోజకవర్గంలో 1116 ఇండ్ల నిర్మాణం చేపట్టగా ఇందులో 401 ఇండ్లు ఇప్పటికే నిర్మాణం పూర్తి కాగా ఇందిరమ్మ మూడవ విడత లో నిర్మించిన 384 ఇండ్లు పంపిణీ కి సిద్ధం గా ఉన్నాయి.దీని కోసం 15000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మిగతా ఇండ్ల పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. కోదాడ నియోజకవర్గ పరిధిలో వెయ్యి ఇండ్లు నిర్మాణం చేపట్టగా 814 ఇండ్లు నిర్మాణం పూర్తయ్యాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో 450 ఇండ్లు నిర్మాణం జరుగుతుండగా 80 ఇండ్లు నిర్మాణం పూర్తయ్యాయి. మునగాల మండలంలోని కోదండ రామాపురంలో 50 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. లబ్దిదారుల ఎంపిక జరిగింది. ఇళ్ళు పంపిణీ చేయాల్సివుంది. ఇంకా ఆకుపాములలో 40 కలకోవలో40 ఇండ్ల నిర్మాణం పూర్తయి లాటరీ ద్వారా లబ్దిదారుల ఎంపిక జరిగింది.అర్హులైన వారి జాబితా ను ఆమోద కోసం కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. మునగాల మాధవరం గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండకల నిర్మాణం కొనసాగుతుంది.
యాదాద్రిభువనగిరి జిల్లాలో
జిల్లాకు 3620 మంజూరు కాగా ఇప్పటివరకు 1270 ప్రారంభమైనాయి. అందులో 829 పూర్తయినాయి. ఆలేరు 64, తుర్కపల్లి 40, మోట కొండూరు 40, ఆత్మకూరు 48, ఉప్పల్ పహాడ్ 45 ,వంగపల్లి 40 ,మాసాయిపేట 40 ,దండు మల్కాపురం 72,మోట కొండూరు 40 ,ఆత్మకూరు 48, సర్వేల్ 64 బీబీనగర్ 11 ,కొండమడుగు 36 ,పోచంపల్లి 126 ,జిబ్లాక్ పల్లి 36 పూర్తయినయి. భువనగిరిలో 530 నిర్మాణం పూర్తయినా డ్రెయినేజీ పనులు పూర్తిగా కాకపోవడంతో ప్రారంభించలేదు.
కొన్ని మండలాల్లో అసంపూర్తిగా.., కానరాని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో 25 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు.పంపిణీ చేయడంలో ఆలస్యం జరగడంతో ఎలాంటి నివాసం లేని దరఖాస్తులు చేసుకున్న కొంతమంది సంవత్సరం క్రితం ఆక్రమించుకొని ,అందులోనే ఉంటున్నారు . చివరకు వారికి పట్టాలు అందజేశారు .220 దరఖాస్తులు వచ్చాయి. దేవరకొండ పట్టణ శివారులో 570 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు .నిర్మాణ పనులను చేపట్టి దాదాపు రెండేండ్లు గడుస్తున్నప్పటికీ పంపిణీకి నోచుకోలేదు. 2400 దరఖాస్తులు వచ్చాయి .ఈ నిర్మాణం చేపట్టిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కొండభీమనపల్లి గ్రామస్తులకు కూడా పంపిణీ చేయాలని డిమాండ్ కూడా ఉంది .డబల్ బెడ్ రూమ్ నిర్మాణం చేపట్టిన స్థలం కొండ భీమనపల్లి గ్రామపంచాయతీకి చెందడంతో గ్రామస్తులు తమకు కూడా పంపిణీ చేయాలని పలుమార్లు డిమాండ్ చేశారు. దీంతో ఇండ్ల పంపిణీలు ఆలస్యం జరుగుతుంది. తిరుమలగిరి మండల, మర్రిగూడ మండలంలో డబుల్ బెడ్రూరం స్థలం గుర్తించలేదు. ఆలేరు మండలానికి సంబంధించి కొలనుపాక గ్రామంలో 64 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు ఆ గ్రామానికి సంబంధించిన వారు 150 మంది దరఖాస్తు చేసుకున్నారు 64 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 64 మందికి పంపిణీ చేశారు.నాంపల్లి మండలంలో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం స్థలం గుర్తించడం కానీ, లబ్ధిదారులను గుర్తించడం కానీ చేయలేదు.మఠంపల్లి మండలంలో ఒకేఒక గ్రామం యాతవాకిళ్లలో 20 ఇండ్లు నిర్మించి ఐదేళ్లు గడుస్తున్నా నేటికీ పంపిణీ జరగలేదు. గుండాల మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శిలా ఫలకలకే పరిమితం. డబుల్ బెడ్ రూమ్ లు మండలంలో 3 గ్రామాలకు మంజూరయ్యాయి.కానీ పనులు ఎక్కడ ప్రారంభం కాలేదు. అడ్డగుడూర్ మండలంలో డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు కాలేదు, పనులు కూడా ఎక్కడ ప్రారంభం కాలేదు. దామరచర్ల మండలం లో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఊసేలేదు.కొన్ని సంవత్సరాల క్రితం భూమిని కేటాయించగా , అభూమి పై తమకు పట్టాలు ఇచ్చారని కొందరు పేదలు అడ్డుకున్నారు. దీనితో ఆ ఊసే లేకుండా పోయింది.మునుగోడు మండలంలో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం స్థలంను గుర్తించారు కానీ ఎలాంటి పనులు ప్రారంభించలేదు లబ్ధిదారులను గుర్తించడం జరగలేదు.పెద్దవూరలో ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అవిషయాలు ఆధికారులకే తెలవదని చెప్పారు ఇంతవరకు మాకు ఏమి తెలియదని చెప్పారు.అనుములలో... ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు విషయాలు ఆధికారులకే తెలవదని చెప్పారు. కనీసం స్థల సేకరణ చేపట్ట లేదు. ఇంతవరకు మాకు ఏమి తెలియదని చెప్తున్నారు.పెన్‌పహాడ్ మండలంలోని సింగారెడ్డిపాలెంలో 126 ఇండ్లను నిర్మించి మొదటి విడతలో 102 అర్హులకు పంపిణీ చేశారు. చేదేళ్ల గ్రామంలో మొత్తం 125 ఇండ్లు ఉండగా, రెండవ విడతలో మొత్తం 375 దరఖాస్తులు వచ్చాయి. అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.కొండమల్లేపల్లి మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 400 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 102 మందిని అర్హులుగా తేల్చి నిర్మించినటువంటి 30 ఇండ్లను లాటరీ ద్వారా 30 మంది లబ్ధిదారులకు పట్టాలి ఇచ్చి అందజేశారు. చండూర్ మండలంలో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం స్థలం గుర్తించడం కానీ, లబ్ధిదారులను గుర్తించడం కానీ చేయలేదు. తుర్కపల్లి మండల కేంద్రంలో 40 ఇండ్ల్లు నిర్మించి నాలుగేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు పంపిణీ చేయలేదు. గరిడేపల్లి మండలంలోని ఖుతుబ్ షాపురం గ్రామంలో మొత్తం 25 ఇండ్లు ఉండగా 110 దరఖాస్తులు వచ్చాయి అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. చింతపల్లి మండలంలో మొత్తం నాలుగు గ్రామపంచాయతీలో గడియ గౌరారం 25 మందికి పంపిణీ చేశారు. అనాజీపురం , చింతపల్లి గ్రామాల్లో 25ఇండ్లు కట్టారు. కానీ పంపిణీ జరగలేదు. నేల్వలపల్లి గ్రామంలో 20 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి. నార్కట్ పల్లి మండలంలో నక్కలపల్లి బ్రాహ్మణ వెల్లంల ఔ రవాణి గ్రామాలలోడబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేశారు నక్కలపల్లి గ్రామంలో 80 ఇండ్లను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసి కేవలం 72 ఇండ్లు నిర్మాణం చేపట్టారు .అందులో 64 పూర్తి చేశారు.8 నిర్మాణంలో ఉన్నాయి. 8 ఇంకా మొదలుపెట్టలేదు. బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో 150 డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేశారు .వాటి కోసం 750 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఐదు సంవత్సరాలుగా నిర్మాణం చేసిన ఇండ్లను నేటి వరకు పంపిణీ జరగలేదు. ఔరవాణి గ్రామంలో 80 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసి ఐదు సంవత్సరాలుగా నత్త నడక నిర్మాణం జరుగుతూ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.పెద్ద అడిశర్లపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామపంచాయతీలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం కోసం రెండు సంవత్సరాల క్రితం స్థల పరిశీలన చేసి, ఆ స్థలం ఇండ్ల నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. దామరచర్ల మండలం లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఊసేలేదు.కొన్ని సంవత్సరాల క్రితం దామరచర్ల లో భూమిని కేటాయించగా , అభూమి పై తమకు పట్టాలు ఇచ్చారని కొందరు పేదలు అడ్డుకున్నారు. దీనితో ఆ ఊసే లేకుండా పోయింది. ఈ విషయంపై హౌజింగ్ పీడీ రాజుకుమార్‌ను వివరణ కోరేందుకు నవతెలంగాణ పలుమార్లు పోను చేయగా, మెస్సేజు పెట్టినా స్పందించలేదు.
కిరాయికి ఉంటున్న
దుడుగు నాగలక్ష్మి, ఆలేరు రూరల్
30ఏండ్ల కిందట కొలనుపాక గ్రామానికి వచ్చి నివాసముంటున్నాను. డబుల్బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాం. ముందుగా అధికారులు పంచనామ చేసి మీకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తదని మొదటి విడతలో చెప్పి రెండవ విడత తీసేసరికి నీకు రాదు అని చెప్పారు .ఎంత బతిమిలాడిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు. నా అనుకున్న వారు నాకు ఎవరూ లేరు.
నాకు ఎలాంటి జాగలేదు
బోయిని ఎల్లమ్మ ,ఆలేరురూరల్
నాకు భర్త లేడు నేను వితంతువును మొదటి విడత లాటరీ తీయడంలో నా పేరు ఉంది తీరా డబుల్ బెడ్ రూమ్ ప్రారంభోత్సవానికి ముందు రోజు వేరే వాళ్ల పేరు ఆమోదించారు ఏమిటి అని ప్రశ్నించడంతో నీకు ఇల్లు లేదు జాగలేదు కానీ 3లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ుంజూరు అప్పటివరకు చేస్తాంలే అంటున్నారు.
ఎన్నోఏండ్లుగా అద్దెఇంటిలో ఉంటున్నాం
రేముడాల అన్నమ్మ, హౌసింగ్‌బోర్డు మిర్యాలగూడ
20 ఏండ్ల నుండి ఇంటి, స్థలాల కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఇల్లు మంజూరు కాలేదు.ఎన్నో ఏళ్లుగా అద్దే ఇండ్లలో కాలం వెల్లదీస్తున్నాం. అద్దెలు కట్టలేక సంపాదంత ఇంటి కిరాయిలకే సరిపోతుంది. ఎన్నిసార్లు ఆర్జీలు పెట్టుకున్నా డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు కావడం లేదు. ప్రభుత్వం ఇప్పుడైనా డబుల్ బెడ్ రూమ్ ఇలు మంజూరు చేసి సొంతింటి కల నెరవేర్చాలి.