Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
చేనేత సహకార వ్యవస్థను పటిష్టపర్చేందుకు చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చేనేత కార్మిక సంఘం యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో గురువారం చేనేత కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటంతో సాధించుకున్న చేనేత సహకార వ్యవస్థను ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, చేనేత సహకార సంఘాల పదవీకాలం ముగిసి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వెనుకాడుతుందన్నారు. సహకార సంఘాల్లో నామమాత్రపు పాలకవర్గాలు ఉండటంతో కార్మికులకు సంఘాలు పనికల్పించ లేని పరిస్థితిల్లో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా చేనేత సహకార వ్యవస్థను పటిష్టపర్చి వెంటనే సంఘాల ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో చేనేత నాయకులు చింతకింది సోమరాజు, జెల్ల వెంకటయ్య, వడ్డేపల్లి లక్ష్మణ్, జెల్ల గణేష్, శాంతమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.