Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంకరపోసి వదిలేసిన వైనం
- దుమ్ముదూళితో ఇక్కట్లు
- ప్రమాదాల బారిన వాహనదారులు
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆలేరు నుండి అమ్మనబోలుకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2004లో ఆలేరు నుండి అమ్మనబోలు వరకు పదిహేను కిలోమీటర్ల వరకు రోడ్డును వేశారు. అప్పటి నుండి నేటి వరకు రోడ్డుకు ఎలాంటి మరమ్మతులు చేయలేదు. రోడ్డు మొత్తం ధ్వంసమైంది. గుంతలు పడడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అమ్మనబోలు నుండి ఆలేరుకు వెళ్లాలంటే మాటూరు ,శర్బనాపురం, ఇక్కుర్తి, మంతపురి, దిలావర్పూర్ ,బహదూర్ పేట గ్రామాల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కంకర పోసి వదిలేశారు. ఆ కంకర మీద వాహనాలు జారి కిందపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. అంతేకాకుండా వాహనాల వెనుకనుండి దుమ్ము ఒక పొగ మంచు లాగా రావడంతో వెనక వచ్చే వాహనదారులకు కూడా ఇబ్బందిగా మారింది. ఈ రహదారిపై ఇక్కుర్తి చెరువు కుంట మీద కంపచెట్లు ఏపుగా పెరగడంతో ముందు వచ్చే వాహనాలు కనబడకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు వంద గుంతలు దానికి తోడు 20 స్పీడ్ బ్రేకర్లు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తారు రోడ్డు వేసి 20 ఏండ్లు అవుతుంది.
బుగ్గ నవీన్ శర్బనాపురం గ్రామ వార్డు సభ్యులు
2004లో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు బి ఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ రోడ్డు రిపేర్ చేసిన పాపా నా పోలేదు కనీసం రోడ్డుకు చుట్టుపక్కల ముండ్ల చెట్లను కూడా తొలగించలేదు. రోడ్డు వేసేందుకు కంకరపోసి వదిలేశారు .అసలే వేసవికాలం ముందు ముందు ఇంకా ఎక్కువ దుమ్ము దూళితో నిండిపోయి బట్టలు మాస్తున్నాయి. వాహనాలు పాడవుతున్నాయి.
కాలేజీకి ఆలస్యమవుతుంది
ఎదు సాయికుమార్ కాలేజీ విద్యార్థి
మా గ్రామం నుండి ఆలేరుకు పది కిలోమీటర్లు అక్కడికి వెళ్లాలంటే కేవలం 15 నిమిషాలు పడుతుంది. కానీ 45 నిమిషాలు టైం తీసుకుంటుంది. కాలేజీకి వెళ్లేసరికి బస్సు మెల్లగా పోవడంతో లేటవుతుంది.