Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలడుగులో వివాదాస్పదంగా మారిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం
- కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తీర్మానం చేయలేదని సహ చట్టంలో వెల్లడి
- బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలంటున్న ప్రజలు
నవతెలంగాణ-మోత్కూర్
మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై వివాదం నెలకొంది. ఎస్డిఎఫ్ నిధులు రూ.5 లక్షలతో నిర్మిస్తున్న భవనం బీసీ కమ్యూనిటీ హాలా లేక గౌడ సంఘం భవనమా అన్న చర్చ నడుస్తోంది. ఇందుకు ఆ భవనం నిర్మిస్తున్న స్థలమే కారణమని గ్రామస్తులంటున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్డీఎఫ్ నిధులు రూ.25 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, మట్టిరోడ్ల పనులు చేస్తుండగా, అందులో రూ.5 లక్షలు బీసీ కమ్యూనిటీ హాల్ కు మంజూరు చేశారు. కాగా బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను 2022 డిసెంబర్ 11న స్థానిక సర్పంచ్ మరిపెల్లి యాదయ్య ప్రారంభించారు.
వివాదమేంటంటే...
గ్రామంలోని పాలసంఘం సమీపంలో గౌడ కులానికి చెందిన వ్యక్తికి ప్లాట్ ఉండగా ఆ స్థలాన్ని గౌడ సంఘం సభ్యులు కొనుగోలు చేశారు. బీసీ కమ్యూనిటీ హాల్ అదే స్థలంలో కట్టడానికి సర్పంచ్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. పిల్లర్ గుంతలు కూడా తీశారు. గౌడ సంఘం సభ్యులకు చెందిన స్థలంలో నిర్మిస్తుండటంతో అది గౌడ సంఘ భవనమేనని, బీసీ కమ్యూనిటీ హాల్ కాదన్న చర్చ జరుగుతుండటం, సర్పంచ్ గాని, పంచాయతీ కార్యదర్శి గాని ఆ భవనంపై స్పష్టతనివ్వకపోవడంతో వివాదమైంది. గ్రామపంచాయతీ తీర్మానం చేసే బీసీ కమ్యూనిటీ హాల్ కడుతున్నామని, అది వివాదం కావడంతో మరోమారు గ్రామపంచాయతీ తీర్మానం చేస్తామని సర్పంచ్ గతంలోనే ప్రకటించారు. ఈనేపథ్యంలో గ్రామానికి చెందిన జి.మధుసూదన్ జనవరి 13న సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దాంతో పాటు గ్రామంలో నిర్మిస్తున్నది బీసీ కమ్యూనిటీ హాలా లేక గౌడ సంఘ భవనమా, గ్రామపంచాయతీ తీర్మానం చేశారా, ప్రభుత్వ స్థలంలోనే నిర్మిస్తున్నారా, అన్న సమాచారం ఇవ్వాలని మధుసూదన్ సమాచార హక్కు చట్టం కింద పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తుకు పంచాయతీ కార్యదర్శి బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై గ్రామపంచాయతీ తీర్మానం చేయలేదని, భవనం ప్రైవేట్ గా కట్టుకుంటున్నారని, ప్రభుత్వ స్థలానికి సంబంధించిన రికార్డులు గ్రామపంచాయతీలో అందుబాటులో లేవని సమాధానమిచ్చారు. ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నందున బీసీ కులాలందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వ స్థలంలోనే బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రస్తుత భవనంతో ఎలాంటి సంబంధం లేదు
శ్రీనివాస్, పీఆర్ ఏఈ, మోత్కూర్
ప్రస్తుత స్థలంలో కడుతున్న ప్రైవేట్ భవనంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. చెల్లింపులు కూడా చేయలేదు. గ్రామానికి మంజూరైన బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లేదు. భవన నిర్మాణానికి ఎస్టిమేషన్ గాని, అగ్రిమెంట్ గాని కాలేదు.