Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి
- ఘాట్‌వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని వీఐపీ శివాలయం ఘాట్ మృత్యువు ఘాట్‌గా మారింది. కృష్ణానదిలో వరద ఉదృత్తిని తట్టుకోలేక నిటమునిగి పర్యాటకులు మృత్యువాత పడుతున్న ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ఘాట్‌లో అనేక సందర్భాల్లో చాలా మంది ప్రాణాలు విడిచారు. ఘాట్‌కి సంభందించి చుట్టు ఫెన్సింగ్ లేకపోవడం, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం, విద్యుత్ ఉత్పత్తి కోసం టర్బైన్లు వదలడం, ఆ నదీప్రవహంలో పర్యాటకులు కొట్టుకుపోయి మృత్యువాత పడటం సర్వసాధారణంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడే అధికారులు హడావుడి చేయడం తప్ప తీసుకోవాల్సిన జాగ్రత్తలు మా త్రం శూన్యమని స్థానికుల ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన ఘటనలు చూసైనా అధికారులు జాగ్రత్తలు తీసుకొని ఉంటే గురువారం జరిగిన ఘటనలో ముగ్గురి ప్రాణాలు విడిచేవారుకాదని స్థానికుల ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కావాల్సిన కనీస సామాగ్రీలు అందుబాటులో లేకపోవడం, గంటల తరబడి కావాల్సిన సామాగ్రీల కోసం వేచిచూడాల్సివస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యాం కృష్ణానది పుష్కర ఘాట్ శివాలయం వద్ద పిండ ప్రదనాలు చేస్తుంటారు. రాత్రి పూట చీకటి ఉండడం వలన ప్రమాదాలు ఎక్కువకగా జరుగుతున్న నందున లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితిలో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఘాట్లలో చుట్టూ ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి మృత్యువు ఒడి నుండి పర్యాటకులను, స్థానికులను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలి
పిట్టంపల్లి హరి కృష్ణ (స్థానికుడు)
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని వీఐపీ శివాలయం పుష్కర ఘాట్‌లో నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఘాట్ చుట్టూ రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం స్పందించి గజ ఈతగాళ్లను, కావాల్సిన సామాగ్రిని అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి.