Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎస్.వెంకట్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
సమాజంలో ప్రతిఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.ఆర్బీఐ ఫైనాన్షియల్ లిటరసీ వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక ట్యాంక్‌బండ్ బతుకమ్మ చౌరస్తా నుంచి గాంధీపార్క్ వరకు లీడ్ బ్యాంకు మేనేజర్ చింతల బాపూజీ అధ్యక్షతన చేపట్టిన 2కె వాకతాన్ను కలెక్టర్ జెండాఊపి ప్రారంభించి మాట్లాడారు.బ్యాంకు ఉద్యోగులు వినియోగదారులకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.దేశంలో డిజిటల్ లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.గతంలో బ్యాంకు లోన్లు పారిశ్రామిక వేత్తలకు మాత్రమే అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం సామాన్యులకు, రైతులకు ప్రతి ఒక్కరికి బ్యాంకులు లోన్లు ఇచ్చి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నాయన్నారు. బ్యాంకులు అందిస్తున్న రుణాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని, సకాలంలో చెల్లించి అభివృద్ధిలోకి రావాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ చింతల బాపూజీ మాట్లాడుతూ ప్రజల కొరకే బ్యాంకులు పనిచేస్తున్నాయని బ్యాంకింగ్ సేవలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.పీఎంజేజేవై, పీఎంఎస్బీవై పథకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజినల్ మేనేజర్ టి.కృష్ణమోహన్, డీఎస్పీ నాగభూషణం, డీఎఫ్ఓ సతీష్, మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, ఏడీఏ రామారావు, డీవైఎస్ఓ వెంకటరెడ్డి పాల్గొన్నారు.