Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
అప్రకటిత కరెంటు కోతను నివారించాలని, రైతులకు24 గంటలు విద్యుత్ ను వ్యవసాయానికి అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.సోమవారం పట్టణంలో పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కోదాడ సబ్ డివిజన్ ఏడీఈ మెండువెంకన్నకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.రాష్ట్రంలో కరెంట్కోతను నివారించాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తానని చెప్పి నేటికీ ఆ వాగ్దానాన్ని అమలు చేయలేకపోతుందని విమర్శించారు.జిల్లావ్యాప్తంగా కొంతకాలంగా వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్ కోత విధించడం మూలంగా లక్షలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదన్నారు. జిల్లావ్యాప్తంగా యాసంగి వరి నాట్లు విస్తారంగా వేశారన్నారు. కరెంటు కోతతో ఎక్కడికక్కడ వరి పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని దీనివలన రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి ఎం.ముత్యాలు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జుట్టుకొండ బసవయ్య, దేవరం వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు, ప్రజా వైద్యశాల హాస్పిటల్ డాక్టర్ ఎస్.సూర్యనారాయణ, రైతుసంఘం జిల్లా నాయకులు ఏనుగుల వీరాంజనేయులు, కౌలుదార్ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సైదా, తదితరులు పాల్గొన్నారు.