Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీవో జయచంద్రారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
డిజిటల్ లావాదేవీలు ఎంతో సులభతరం, సురక్షితమని, కాగా వాటి నిర్వహణలో జాగ్రత్త పాటించాలని నల్లగొండ రెవెన్యూ డివిజనల్ అధికారి జయ చంద్రరెడ్డి అన్నారు. దేశమంతటా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగించి నగదు రహిత డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలన్న సంకల్పంతో భారతీయ రిజర్వు బ్యాంక్ 2023 ఫిబ్రవరి 13 నుండి 17 వరకు ''మంచి ఆర్థిక క్రమ శిక్షణే మనకు రక్షణ'' అనే నినాదంతో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. అందులో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్ నుండి నిర్వహించిన 2 కిలోమీటర్ల వాకాథాన్ను ఆర్డీఓ ఎస్బీఐడీ జీఎం ప్రశాంత్ కుమార్ బారియర్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రజలను ఆర్థిక అక్షరాస్యత వైపు నడిపించాలని వ్యూహంతో రిజర్వు బ్యాంకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇప్పుడు మీ చేతి వేళ్ళ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్‌ను 365 రోజులు 24 గంటలు నెఫ్ట్,ఆర్టీజీఎస్, ఐఏంపీస్, యూపీఐల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు అని తెలిపారు. అయితే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ ఓటీపీలు కాని, పిన్ నెంబర్లు కానీ గోప్యంగా ఉంచాలని, ఉచితంగా వచ్చే డబ్బులకు ఆశపడి వివిధ లింకులను తెరిచి మోసపోవద్దని అన్నారు. మోసపోయినట్లు భావిస్తే 1930, 14448 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ ర్యాలీలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, గృహ నిర్మాణ పీడీ రాజ్ కుమార్, ఎస్బీఐఆర్ఎం విజయ్‌కుమార్, నాబార్డు డీడీ ఓ.వినరు కుమార్, జిల్లా క్రీడలు యువజన అధికారి మక్బూల్ అహ్మద్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.