Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసారీ పాత కాంట్రాక్టర్లే కొనసాగింపు
- 13.27 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా నిర్వాహకులకు శిక్షణా తరగతులు
- అదనపు కలెక్టర్ భాస్కర్రావు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఏప్రిల్ మాసంలో ప్రారంభం కానున్న యాసంగి సీజన్ 2022-23 ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఛాంబర్లో పౌర సరఫరాలశాఖ, వ్యవసాయశాఖ, మార్కెటింగ్, సహకారశాఖ, రవాణాశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యాసంగి సీజన్ 2022-23 ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు కార్యాచరణతో అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. వ్యవసాయ శాఖ అంచనా మేరకు జిల్లాలో సుమారు 5 లక్షల 31 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, 13 లక్షల 27 వేల 500 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయడం జరిగిందని, ఇందులో 10 లక్షల 62 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వరి ధాన్యం, 2 లక్షల 65 వేల 500 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారని తెలిపారు. ఉత్పత్తి అయిన దాన్యంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సహకార శాఖ లు చర్చించు కొని,అనువైన ప్రదేశంలో కొనుగోలు కేంద్రం లు ఏర్పాటుకు జాబితాను పంపించాలని సూచించారు. గన్ని సంచులు సేకరించుకోవాలని, ఇప్పటికే 70 లక్షల గన్ని సంచులు అందుబాటులో ఉన్నవని, ఇంకా రెండు కోట్ల గన్ని సంచులు అవసరం ఉందని, గన్ని సంచులు సమకూర్చు కొవాలని పౌర సరఫరాల డీఎంను ఆదేశించారు. వానాకాలం సీజన్లో ఎంపిక చేసిన పదిమంది కాంట్రాక్టర్లు యాసంగి సీజన్లో కూడా కొనసాగుతారని, అవసరమైన లారీలను ధాన్యం రవాణాకు సరఫరా చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ తరగతులు నిర్వహించి అవగాహన కలిగించాలని ఆయన అన్నారు. యాసంగికి కావాల్సిన ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారిణి కాళిందిని, పౌర సరఫరాల డీఎం నాగేశ్వర్ రావు, వ్యవసాయశాఖ జేడీి.సుచరిత, మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, జిల్లా సహకార అధికారి రాజేందర్ రెడ్డి, నల్గొండ,మిర్యాలగూడ రైస్ మిల్లర్ల ప్రతినిధులు యాదగిరి, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.