Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు
- ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని నల్లగొండ పట్టణంలోని పానగల్లో గల ఛాయా, పచ్చల సోమేశ్వరాలయం దేవాలయాల వద్ద పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ. రమణాచారి తెలిపారు. మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పండగ ఉన్నందున మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బందితో కలిసి అక్కడ చేపట్టిన పనులను బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పానగల్ సెంటర్ నుండి ఛాయా, పచ్చల సోమేశ్వరాలయం వరకు వీధిలైట్లను ఏర్పాటు చేయాలని, వాటితోపాటు పానగల్ కట్టపైన కూడా వీధిలైట్లను ఏర్పాటు చేయాలని, ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విధిగా సూచిక బోర్డులను, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. 50 మంది సిబ్బందితో ఎప్పటికప్పుడు దేవాలయాల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. బారికేట్ల ఏర్పాటు వీఐపీల పార్కింగ్ సంబంధిత విషయాలపై దేవాలయ చైర్మెన్ జీ. అనంతరెడ్డి తో చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఈలు వెంకన్న, నరసింహారెడ్డి, ఏఈలు దిలీప్, ప్రవీణ్, ఏసీపీ నాగిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు మూర్తుజా, శంకర్, హరితహారం, శానిటరీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.