Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగారం
నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో కరెంటు అధికారుల వైఖరికి నిరసనగా గురువారం సూర్యాపేట జనగాం ప్రధాన రహదారిపై గ్రామానికి చెందిన దళితులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెంటు బిల్లు కట్టలేదని సాకుతో గ్రామంలో పనిచేస్తున్న కరెంటు సిబ్బంది ఇండ్లల్లోకి చొరబడి దౌర్జన్యంగా ఫ్యాన్లు, టీవీ స్టెప్ లైజర్ను ఎత్తుకెళ్లడం బాధాకరమన్నారు. దీని ద్వారా దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, అగౌరవపరిచే విధంగా వ్యవహరించిన సిబ్బందిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 100 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తామని చెబుతుంటే కరెంటు అధికారులు మాత్రం అటువంటి పథకం ఏమీ లేదని ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దళితులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 365 జాతీయ రహదారిపై ఒక గంట సేపు ధర్నా , రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ముత్తయ్య ధర్నా చేస్తున్న వారితో మాట్లాడి కరెంటు సిబ్బంది తీసుకెళ్లిన వస్తువులను తిరిగి ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో పంది గణేష్, ఎర్ర నరేష్, నాతి వీరమల్లు, అంబేద్కర్, ఎర్ర రాంబాబు, యాకోబు, గిరిప్రసాద్, సురేష్, నరసింహ, అవిలయ్య, బాబేష్ ,రవి, కష్ణ తదితరులు పాల్గొన్నారు.