Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాటు పూర్తి చేసిన పాలకమండలి సభ్యులు
- దేవాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు
నవతెలంగాణ -నల్లగొండ
ఈ నెల 18న శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలు ముస్తాబయ్యాయి. దేవాలయ పాలకమండలి సభ్యులు విద్యుత్ కాంతులతో దేవాలయాలకు అందంగా అలంకరించారు. జిల్లా కేంద్రంలోని పానగల్లులో నెలకొన్న పచ్ఛల సోమేశ్వరాలయం ,ఛాయా సోమేశ్వర ఆలయం విద్యుత్ కాంతులతో అలంకరించారు. శివ రాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా దేవస్థానం పాలకమండలి ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు .
పచ్ఛల సోమేశ్వరాలయం విశిష్టత. . .
11-12వ శతాబ్దంలో కుందూరు చోళులు రాజుల రాజధానిగా ఉండేది. ఇక్కడ కాకతీయులకు సామంతులైన కుందూరు చోళులు పచ్చల సోమేశ్వర ఆలయా సముదాన్ని నిర్మించారు .ఆలయం లోపల నంది చుట్టూ నాలుగు స్తంభాల మీద రామాయణ మహా భారతం, భాగవతం గాథలు చెక్క బడి ఉన్నాయి. స్వామివారి కింద పచ్చలుపొదగబడి ఉండటం వల్ల ఈ దేవాలయానికి పచ్చల సోమేశ్వరాలయం నామకరణం జరిగింది .
నేటి నుంచి శివరాత్రి పూజలు :ఆలయ చైర్మెన్ మహేష్
శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని నేటి నుండి 20 వరకు పచ్చల సోమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మెన్ తెలిపారు. శుక్రవారం కుంకుమార్చనలు, శనివారం శివరాత్రి పర్వదినం ఉదయం 4-30మొదలుకొని రాత్రి 10గంటల వరకు స్వామివారికి ఆకుపూజ అఖండ దీపారాధన ,రుద్రాభిషేకములు ,స్వామివారికి కళ్యాణ మహౌత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు.19 న స్వామివారికి మంగళహారతులు మంత్రపుష్పం స్వామివారికి సుప్రభాత సేవ 20నఅగ్ని గుండాలు ,మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చైర్మన్ పేర్కొన్నారు .
ఛాయా సోమేశ్వర ఆలయం ప్రత్యేకత. . .
అతి ప్రాచీనమైన భారతదేశ చరిత్ర తెలిపే సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. వందల ఏళ్లు పాలించిన రాజులు వైభవాన్ని తెలిపే విశిష్టమైన నిర్మాణాలు దేశంలోని ప్రతిమూలలో వున్నాయి.అధునాతన టెక్నాలజీతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన కట్టడాలు నేటి ఇంజినీర్లకు సవాలుగా విసురుతూనే ఉన్నాయి.అలాంటి ఆలయాలలో ప్రసిద్ధి చెందినది ఛాయా సోమేశ్వర ఆలయం.నల్లగొండ పట్టణంలోని ఈ దేవాలయంలో ఎల్లవేళలా ధ్వజస్తంభం నీడ దేవుడిపై పడుతూ ఉంటుంది.ఛాయా సోమేశ్వర ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కెక్కింది.ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా కనిపించని విశేషం గర్భాలయంలోని నీడ(ఛాయ)కప్పేయడం.ఈ ఆలయానికి ముఖ ద్వారం ముందు రెండు స్తంభాలుంటాయి. వాటి ద్వారా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపూ ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత.మరో చిత్రమైన విషయం ఏమిటంటే ఆ నీడ ఏ వస్తువుదనే విషయం అంతు చిక్కదు.
సహకారంతో దేవాలయం అభివద్ధి :చైర్మెన్ గంట్ల అనంతరెడ్డి
ఓజోఅగ్రికెర్ సహకా రంతో పూర్వ దేవాల యాల ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రూ.20లక్షల వ్యయంతో దేవాలయంలో గార్డెనింగ్ ,భక్తుల క్యూ లైన్ కోసం స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేశాం. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.
దేవాలయ వద్ద భారీ బందోబస్తు. డీఎస్పీ నర్సింహారెడ్డి
శివరాత్రి పర్వదిన సందర్భంగా దేవాలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. దేవాలయ వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న అక్కడ ఉన్న పోలీస్ శాఖకు సమాచారం అందించాలని కోరారు.