Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లులక్ష్మీ
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు, ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మీ అన్నారు.శనివారం స్థానిక ఎంవీఎన్ భవనంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యదర్శివర్గసభ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్‌శక్తులకు పెద్దపీట వేస్తూ పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు.దేశంలో పెట్టుబడిదారులకు పన్నుల రేట్లలో ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ పేద మధ్యతరగతి వర్గాలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా పాలన కొనసాగిస్తుందన్నారు.ప్రధానమంత్రి మోడీ తన అనుచరులైన ఆధాని సంస్థలపై చర్యలు తీసుకోకుండా ప్రశ్నించేశక్తుల మీద దాడులు చేయడం దారుణమని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఆధాని హిండెన్ బర్గ్ వ్యవహారంపై విచారణ పారదర్శకంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినా కేంద్రం పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు.స్టాక్ మార్కెట్ రంగంలో ఆధాని షేర్ల ధరల మాయాజాలానికి పాల్పడి షేర్ మార్కెట్ కుప్పకూలిపోయినా ప్రధాని స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు.ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మేధావులు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ దేశంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగడం లేదని వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు.కులాల, మతాల పేరుతో దేశంలో విధ్వేషాలను రెచ్చగొడుతూ కాలమెళ్లదీస్తున్న బీజేపీ విధానాలను ప్రతిఘటించడం కోసం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జాతాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద, మతోన్మాద విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తామన్నారు.దేశంలోని ప్రజల హక్కులను,దేశ భవిష్యత్‌ను కాపాడడం కమ్యూనిస్టులతోనే సాధ్యమని తెలిపారు.పేద ,మధ్య తరగతి వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలపై జరిగే పోరాటంలో ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,కోటగోపి, చెరుకు ఏకలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.