Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువుగట్టులో పోటెత్తిన భక్తజనం
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం మండలంలోనీ శివాలయాలు భక్తుల ప్రత్యేక పూజలతో కిక్కిరిసిపోయాయి. మండల వ్యాప్తంగా ఉన్న శివాలయాలలో చెరువుగట్టు, నార్కట్‌పల్లి, జువ్విగూడెం, నక్కలపల్లి గ్రామాలలో ప్రత్యేకంగా ప్రజలు ఉదయానించే పూజలు చేయడం అభిషేకాలులతో పండుగ వాతావరణం సంతరించుకుంది. శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
చెరువుగట్టులో పోటెత్తిన భక్తజనం..
శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. పూజలు ప్రత్యేక అర్చనలతో చెరువుగట్టు దేవస్థానం కిక్కిరిసిపోయింది.
నక్కలపల్లిలో ప్రత్యేక ఉత్సవాలు..
మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో గల శ్రీ జల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి పురస్కరించుకొని ప్రత్యేకంగా వార్షిక బ్రహ్మోత్సవాలను శనివారం నిర్వహించారు. గ్రామంలో ప్రత్యేకంగా నాటకాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
నార్కట్‌పల్లిలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఉన్న శివాలయంలో ప్రత్యేకంగా ఉదయం నుంచే పూజలు నిర్వహించడం, పట్టణ ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొనడంతో ప్రత్యేక పండుగ వాతావరణం నెలకొంది. గత వారం రోజుల నుంచి మహాశివరాత్రి ఉత్సవాల వేడుకలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేకంగా రంగులతో ముస్తాబు చేశారు. రంగు రంగులవిద్యుత్ దీపాలతో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, మైకులతో పట్టణమంతా హౌరెత్తిపోయింది. రోజు మొత్తం ఆలయ అర్చకులు నిడిగొండ భగవాన్ శర్మ శివరాత్రి ప్రత్యేకతను తెలుపుతూ పూజలు నిర్వహించారు.
కొండమల్లేపల్లి : మహాశివరాత్రి వేడుకలను శనివారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ప్రజలు వేకువ జామున లేచి గ్రామాలలో ఉన్న శివాలయాల వద్ద శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, చిన్నారులు, అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకుంట్ల గ్రామంలో ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డిలు కుటుంబ సమేతంగా కలిసి శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కొండమల్లేపల్లి గ్రామంలో సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, శివాలయం వద్ద శివలింగానికి పాలాభిషేకం, నెయ్యి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నకిరేకల్ : మహా శివరాత్రి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి పర్వదినం ఒకటిగా పరిగణించబడుతుందని, ఆ పరమశివుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆకాంక్షించారు. శనివారం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇటుకుల పహాడ్‌లో కోమటిరెడ్డి పూజలు
శాలిగౌరారం మండలం ఇటుకుల పహాడ్ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రామంలోని శివాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొండూరు నాగరాజు మృతి చెందగా ఆయన భార్యకు రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి దైద రవీందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వడ్డేపల్లి రవి, కాంగ్రెస్ పార్టీ నార్కెట్‌పల్లి మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, కేతేపల్లి పీఏసీఎస్ చైర్మెన్ బోళ్ల వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సమరంరెడ్డి, వడ్డే భూపాల్ రెడ్డి, సర్పంచ్ సైదులు పాల్గొన్నారు.
చండూరు : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక కోట మైసమ్మ, శివాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె స్వగహంలో శివ పార్వతి కళ్యాణ మహోత్సవం చేశారు. స్థానిక సుబ్రమణ్య స్వామి, ఆంజనేయ, మార్కండేయ దేవాలయంలో భక్తులు తెల్లవారుజాము నుండి పూజా కార్యక్రమలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తేలు కుంట్ల చంద్రశేఖర్, తేలుకుంట్ల రాజకుమారి, సముద్రాల ఉమారాణి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కేతపల్లి : ఆధ్యాత్మికతతో ప్రశాంతత లభిస్తుందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం కేతేపల్లీ మండలంలోని ఇనుపాముల గ్రామంలో ఉన్న శ్రీ పచ్చల పార్వతి సోమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. చెరుకుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం ఆరోహణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని గ్రామాలలో శివాలయాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొప్పని స్వర్ణలత మార్కెట్ కమిటీ చైర్మెన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, ఇనుపాముల గ్రామ సర్పంచి జాల వెంకటరెడ్డి, శివాలయ చైర్మెన్ కాను యాదగిరి, ధర్మకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.