Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడం కోసం టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందని, కొన్నేండ్లుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు అమ్మ హాస్పిటల్ చైర్మెన్ డాక్టర్ దాచేపల్లి సుధీర్ అన్నారు.ఆదివారం జిల్లాకేంద్రంలోని సిటీ టాలెంట్ పాఠశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ప్రశ్నాపత్రాన్ని ఆయన విడుదల చేసి మాట్లాడారు.తాను విద్యనభ్యసించే సమయంలో టాలెంట్ టెస్ట్ లు తన ఉన్నతికి ఉపయోగపడ్డాయని గుర్తుచేశారు.విద్యార్థులు బాగా చదివి కుటుంబానికి దేశానికి ఉపయోగపడాలని, వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.రానున్న వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బానోతు వినోద్‌కుమార్,ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, సిటీ టాలెంట్ పాఠశాల ప్రిన్సిపాల్ మురళి, అధ్యాపకులు శర్మ, నాయకులు సుమన్, రవి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.