Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దలతో పాటే చిన్నారులు పనుల్లోనే..
- కనీస వసతులు, రక్షణ చర్యలు కరువు
- కార్మికులను శ్రమదోపిడీకి గురి చేస్తున్న యజమానులు
- కొన్నిచోట్ల అసలు అనుమతులే కరువు
- తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున వైనం
నవతెలంగాణ-నల్లగొండ
ఇటుక బట్టీల్లో బాల్యం బుగ్గి అవుతూ..ఆ చిట్టిచేతులు చక్కని రాతకు, చదువుకు దూరమవుతున్నాయి. చేతిలో బలపం పట్టి చదుకోవాల్సిన చిన్నారులు ఇటుకలు మోస్తూ బట్టీల్లోనే మగ్గిపోతున్నారు. చాలిచాలనీ జీతాలు చెల్లించి కార్మికుల శ్రమను యాజమానులు దోచుకోవడంతో పాటు చిన్నారులను శ్రమ జీవులుగా మార్చి వేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖ సిబ్బందితో చేపట్టిన సర్వేలో ఎక్కువ మంది బడికి వెళ్లకుండా బట్టీల్లోనే పనులు చేస్తూ కనిపించడంతో వారిని దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో కూడా చాలా వరకు బట్టీల్లో పని చేస్తున్న చిన్నారులను గుర్తించారు. ఇదిలా ఉంటే ఇటుక బట్టీల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఊరికి దూరంగా ఉండడంతో పాటు రహదారులకు దూరంగా ఉండి వాహనదారులకు ఆ బట్టీల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సింది పోయి రోడ్డు పక్కనే బట్టీలను నిర్వహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. మరోపక్క బట్టీల్లో పనిచేసే కార్మికులకు కల్పించాల్సిన వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించడమే కాదు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ముందుస్తు ఒప్పందాలతో వెట్టిచాకిరి...
నల్లగొండ జిల్లాలో వందల సంఖ్యలో ఇటుక బట్టీలున్నాయి. ఇందులో పని చేయడానికి బట్టీల యజమానులు ఒరిస్సా, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వలస కూలీలు కుటుంబాలతో సహ వచ్చి ఇటుక బట్టీల్లో పని చేస్తుంటారు. ఇటుక బట్టీల యాజమాన్యం ఆయా రాష్ట్రాలకు వెళ్లి కూలీలకు అడ్వాన్స్ చెల్లించి పనికి తీసుకోచ్చుకుంటారు. ఇదే అదునుతో విద్యాహక్కు, కార్మిక, వాల్టా చట్టాలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. రోజుకు 8 గంటలు పని చేయాలనే నిబంధన ఉన్నా రాత్రింబవళ్లు పని చేయించుకుంటున్నారు. ఒప్పందం ప్రకారం కార్మికులకు వాయిదాల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు. ఈ వాయిదాల్లో వారు ఎలాంటి అనారోగ్యానికి గురైనా, ప్రాణాలుపోయినా యజమానులు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం సైతం అందించకపోగా వారికి ఇచ్చిన అడ్వాన్స్లోనే కోతపెడుతున్నారు. బీమా సౌకర్యం కల్పించడం లేదు. ఊరు కాని ఊరు కావడం, బట్టీలు దాటి బయటకు వెళ్లే దారి కనిపించకపోవడంతో తమపై దౌర్జన్యాలు, వేధింపులు జరుగుతున్నా ఎవరికి చెప్పుకోలేని దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు.
విద్యాహక్కు చట్టంకు తూట్లు పొడుస్తూ చిన్నారులతో పని చేయించుకోవడమే కాకుండా నిబంధనలను ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
అనారోగ్యం బారిన...
జిల్లాలో ఇటుక బట్టీలు జనావాసాలకు సమీపంగా వెలుస్తుండడంతో ఇటుకలను కాల్చినప్పుడు వచ్చేపొగ వల్ల కార్మికులతో పాటు, వాటి సమీప గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటుకల నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల చాలా మంది ఆస్తమా, ఉబ్బసం వంటి రోగాల బారిన పడుతున్నారని తెలుస్తోంది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఆరోగ్య పరీక్షలు ప్రతీనెల చేయించాల్సి ఉండగా అది ఎక్కడా కానరావడం లేదు. నల్లగొండ జిల్లాలోని పలు గ్రామాలకు దగ్గరగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన రహదారి వెంట బట్టీలు పెట్టి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేలా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జనావాసాలకు దగ్గరగా ఇటుక బట్టీలు వెలుస్తున్నా, అనుమతి లేకుండా నడుస్తున్న కార్మికశాఖ, స్థానిక రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తూతూ మంత్రంగా తనిఖీలు...
బడీడు పిల్లలు బడుల్లో చదువుకోవాలనే ఉద్దేశ్యంతో 6-14 సంవత్సరాల వరకు ప్రభుత్వం నిర్బంధ విద్యను అమలుచేస్తుంటే వాటిని అమలు పరుచడంలో అధికారులు మాత్రం విఫలమవుతున్నారు. కార్మిక, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు బట్టీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు పలు సందర్భాల్లో తనిఖీలు చేపడుతున్నా అవి తూతూ మంత్రంగానే ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతీ ఏటా ఆపరేషన్ స్మైల్ పేరుతో చిన్నారులను గుర్తించడం సంబంధిత ఇటుక బట్టీల నిర్వాహకులకు చిన్నపాటి జరిమానాలు విధించి ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడం, కఠిన చర్యలు చేపట్టకపోవడంతోనే బట్టి నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పేర్కొంటు న్నారు. ఇటీవల విద్యాశాఖ అధికారులు చేపట్టిన బడి బయట పిల్లల సర్వేలో జిల్లాలోనే బట్టీల వద్దనే చిన్నారులు పాఠశాలలకు వెళ్లకుండా తమ తల్లిదండ్రులతో కలిసి పనులు చేయడం గుర్తించారంటే ఏ స్థాయిలో ఇతర విభాగాల పనితీరు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఇటుక బట్టీలపై ప్రత్యేక దష్టి సారించి చిన్నారుల బాల్యాన్ని బట్టీల్లోనే కరిగిపోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పిల్లలతో పనులు చేస్తే కఠినమైన చర్యలు
ఖుష్భు గుప్తా (అదనపు కలెక్టర్)
జిల్లాలో ఎక్కడైనా బడి ఈడు పిల్లలతో ఇటుక బట్టీలలో బలవం తంగా పనులు చేయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో బాల కార్మికులు ఉండటానికి వీలు లేదు. జిల్లాలో ఎక్కడైనా హోటళ్ళు, వ్యాపార సంస్థలు, వ్యవసాయ పొలాలు, ఇంట్లో బానిసలుగా పని చేస్తుంటే స్పెషల్ ఆపరేషన్ ద్వారా గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇందుకు తరచుగా ఆపరేషన్ ముష్కాన్, ఆపరేషన్ స్మెల్తో పాటు లేబర్ ఆఫీసర్ ద్వారా జిల్లాలో పర్యవేక్షణ జరగాలని ఆదేశించాం. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలను పనిలో చేర్చుకుంటే సెక్షన్ (3 ) పీ అండ్ ఆర్ అమెండ్మెంట్ యాక్టు 2016 ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.14 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు పిల్లలను పనిలో పెట్టుకుంటే రూ.50 వేల జరిమానా లేదా జైలు శిక్ష పడుతుంది.