Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ సత్పతి పమేలా
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి వారి వార్షిక బ్రహోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కాన్ఫరెన్స్ హాలులో డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేశ్ చంద్ర, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, సంబంధిత అధికారులతో రేపటి నుండి ప్రారంభమయ్యే శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, బందోబస్తు చర్యలను ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యాదాద్రి దేవస్థానం పునర్నిర్మాణం తరువాత జరిగే మొదటి బ్రహ్మోత్సవాలు కాబట్టి, రేపు 21 వ తేదీ నుండి మార్చి 3 వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో విచ్చేసే భక్తులకు, ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా 27వ తేదీన స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 28వ తేదీన తిరు కళ్యాణ మహోత్సవం, మార్చి ఒకటవ తేదీన దివ్య విమాన రథోత్సవ కార్యక్రమాలలో భక్తజన రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కొండ పైన, క్రింద పారిశుద్య చర్యలు పక్కాగా నిర్వహించాలని, ఎక్కడా చెత్త కనబడకుండా నిర్విరామంగా సిబ్బందితో చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట పారిశుద్య సిబ్బందిని అదనంగా నియమించాలని, తాగునీటి వసతి కేంద్రాలు ఎక్కువ కల్పించాలని, నిర్విరామంగా తాగునీరు పంపింగ్ చేపట్టాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అగ్నిమాపక వాహనాలు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని, భక్తులకు తగిన విధంగా ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేయాలని, రద్దీ ఉన్న ప్రాంతాలలో అదనపు బస్సుల సౌకర్యం కల్పించాలని, వివిధ ప్ర్రాంతాలలో మెడికల్ ఫస్ట్ ఎయిడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని, 104, 108 వాహనాలను అందుబాటులో వుంచాలని, అలాగే వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మందులు, వైద్య సిబ్బందితో సిద్దంగా వుండాలని ఆదేశించారు.డిప్యూటీ పోలీసు కమిషన్ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, బ్రహ్మౌత్సవాల సందర్భంగా భక్తులకు, ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో యాదాద్రి దేవస్థానం పరిధి ఏసిపి చంద్రయ్య, యాదాద్రి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాస్కర్, జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు రోడ్లు భవనాలు ఎక్స్పీరియన్స్ శంకరయ్య ఇంజనీర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ , కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం. నాగేశ్వరరావు చారి యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, యాదగిరిగుట్ట తహసిల్దార్ రాము నాయక్, ట్రాఫిక్ సిఐ శివశంకర్, సీఐ సైదులు, అధికారులు పాల్గొన్నారు.