Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో రైతన్నలు
నవతెలంగాణ -ఆలేరురూరల్
వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం 6 గంటలే అమలవుతోంది. రాత్రి సమయంలో 3 గంటలు, ఉదయం సమయంలో 3 గంటలు వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కరెంటు కోతల కారణంగా నిరందక వరిచేలు ఎండిపోతున్నాయి.
ఆలేరు మండలలో గతేడాది 5050.20 ఎకరాల సాగు చేస్తే ఈ ఏడాది ఖరీఫ్, రబీసాగు కలుపుకొని 1052.15 ఎకరాల సాగు చేశారు. గతేడాదికంటే సాగు పెరగడంతో కరెంట్ వినయోగం కూడా పెరిగింది. మండలంలో ఈ యాసంగిలో 5వేల ఎకరాల్లో సాగుచేశారు. వరి పొట్ట దశలో ఉంది నీరు పుష్కలంగా ఉండాలి.
పంటలు చేతికొస్తున్న సమయంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో బోర్లు నిరంతరం నడుస్తున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు ఈ నెల మొదటి వారం నుండి విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. మండలంలోని శర్బనాపురం, కొల్లూరు ,మంతపురి, గొలనుకొండ, శ్రీనివాసపురం, గుండ్ల గూడెం, పలు గ్రామాలలో పలుచోట్ల చిరు పొట్ట దశలో ఉన్న వరి పొలాలు ఎండిపోతున్నాయి.మండలంలోని కొలనుపాక ,శారాజిపేట, పటేల్ గూడెం, గొలనుకొండ సబ్ స్టేషన్లో వివరాలు అడగగా పై నుండి చెప్పినట్టుగా అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇస్తున్నారు. ఇకనుంచైనా పూర్తిస్థాయిలో కరెంటు ఇవ్వకపోతే వరితో పాటు ఆరుతడి పంటలు సైతం ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఒక్కొక్క సబ్ స్టేషన్లో ఒక్కొక్క విధంగా
ఆలేరు మండలంలోని కొలనుపాక లో పెద్ద సబ్ స్టేషన్ ఉండగా దాని కింద కొలనుపాక, పటేల్ గూడెం, శారాజిపేట ,గొలనుకొండ, ఆలేరులో రెండు సబ్ స్టేషన్లు ఉన్నాయి. మండలంలోని అంతట ఒకే సమయంలో కరెంటు ఇవ్వడంతో లైన్ లో ట్రిప్పు అవుతుండగా సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. సమస్యను నివారించేందుకు ఒక్కొక్క సబ్ స్టేషన్ నుండి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సమయం పాటిస్తున్నారు.
ఎండలు ముదిరితే కష్టమే.
సుధగాని సత్త రాజయ్య, శర్బనాపురం రైతు
8 ఎకరాల్లో వరి నాటు వేశాను. ఉదయం 11 గంటలకు వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు పోతుంది. రాత్రి 11 గంటలకు వచ్చి ఒంటిగంట వరకు త్రీ పేజ్ కరంట్ ఇస్తున్నారు. పగలు ఏదైనా సమయంలో త్రీ పేజ్ కరెంటు సరఫరా నిలిచిపోతే తిరిగి ఇవ్వడం లేదు. ఎండలు ముదిరితే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
త్రీ పేజ్ కోసం పడిగాపులు కాస్తున్న
సిరిగిరి ఐలమ్మ రైతు
ఉదయం ఆరు గంటల సమయంలో త్రీ పేజ్ కరెంటు ఇవ్వడం లేదు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. రాత్రి సమయంలో అయితే కరెంటీ వస్తదేమో అని పడిగాపులు కాస్తున్న ఒకరోజు 11 గంటలకు ఇస్తే మరుసటి రోజు రెండు గంటలకు వస్తుంది సమయం అనేది పాటించడం లేదు. ఉదయం అయితే బాయి మోటర్ పెట్టడానికి పడిగాపులు కాస్తున్న.
పొలం ఎండుతుంది
బండ శ్రీనివాసు పటేల్ గుడం రైతు
నాకున్న మూడు ఎకరాలలో వరి సాగు చేశాను. ఈ నెల మొదటి వారం నుండి విద్యుత్ సరఫరా సరిపడు లేకపోవడంతో పొలం ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కనీసం 12 నుండి 14 గంటల కరెంటు ఇచ్చినట్లయితే వరి పంట ఎండిపోదు.
గంట ముందు మెసేజ్ పెడుతున్నారు
మండల ఇన్చార్జి విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాస్
త్రీ పేజ్ కరెంటు ఎప్పుడు వస్తదని పై అధికారులకు అడిగినట్లయితే ఒక గంట ముందు మెసేజ్ పెడుతున్న చూసుకో అంటున్నారు. ఎప్పుడు వస్తుందో సరిగ్గా సమయం చెప్పలేను ముందు ముందు ఇలాంటి కరెంటు సమస్యలు ఉంటాయి. ఎందుకు అంటే కరెంటు కోత ఉన్నది కాబట్టి బోర్లు ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి. ఆటోమేటిక్ స్టార్టర్ తీసివేయాలి. నీటిని ఆదా చేసుకోవాలి. కరెంటును కూడా ఎక్కువగా వాడకూడదు.