Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుండి డబల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తుల స్వీకరణ
- 48 వార్డులకు 12 కేంద్రాల ఏర్పాటు
- జిరాక్స్ సెంటర్లలో లభించునున్న దరఖాస్తు ఫారాలు
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించి ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ఏండ్లు గడిచినా పూర్తి కాలేని స్థితిలో ఉంది. పేదవారు తన సొంతింటికలను సహకారం చేసుకునేందుకు ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఫలితం ఇప్పటిలో దక్కేలా కనిపించడం లేదని పలువురు పట్టణవాసులు పేర్కొంటున్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను వేగవంతంగా పూర్తిచేసి పేదలకు ఇండ్లను అందివ్వాలని చేసే ప్రభుత్వ ప్రయత్నం ఫలించేలా లేదు. ఎంతోకాలంగా ఇండ్ల నిర్మాణాలను చేపట్టిన అవి నేటికీ పూర్తిస్థాయిలో నిర్మాణాలకు నోచుకోకపోవడమే అందుకు గల కారణం. గృహ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పట్టణ కేంద్రాలలో లబ్ధిదారుల ఎంపికను ఈనెల 26 వరకు పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి జిల్లా కలెక్టర్‌ను ఇప్పటికే ఆదేశించారు. గత గురువారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపికపై సమీక్షించారు. దీంతో జిల్లా అధికారులు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. నేటి నుండి ఈనెల 26 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
12 కేంద్రాలలో దరఖాస్తుల స్వీకరణ...
నల్లగొండ పట్టణంలో 48 వార్డులు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణ కోసం మున్సిపల్ అధికారులు నాలుగు వార్డులకు ఒక కేంద్రంగా 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటవ కేంద్రాన్ని పట్టణంలోని ఎల్లమ్మ గుడి దగ్గర స్వరాజ్ భవన్ వద్ద ఏర్పాటు చేశారు. ఇక్కడ 1,2, 18, 19 వార్డులకు సంబంధించిన దరఖాస్తులను తీసుకొని ఉన్నారు. రెండవ కేంద్రాన్ని కేశవరాజు పల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేశారు. అక్కడ 3, 4, 5, వార్డులకు సంబంధించి, మూడవ కేంద్రాన్ని డైట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. అక్కడ 20, 21, 22, 43 వార్డులకు సంబంధించి, నాలుగవ కేంద్రాన్ని మన్యం చెలకలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసి 6, 23, 24, 44, వార్డులకు సంబంధించిన దరఖాస్తులను తీసుకోనున్నారు. ఐదవ కేంద్రాన్ని దుప్పలపల్లి రోడ్‌లోని లెప్రసీ హాస్పటల్ హాస్టల్ నందు ఏర్పాటు చేసి 7, 8, 9, 10 వార్డులు, ఆరవ కేంద్రాన్ని ఓల్డ్ సిటీలోని జేబీఎస్ స్కూల్లో ఏర్పాటు చేసి 11, 12, 25, 26 వార్డులు, ఏడవ కేంద్రాన్ని శ్రీకృష్ణ నగర్‌లోని యాదవ భవనంలో ఏర్పాటుచేసి 27 నుండి 30 వ వార్డు వరకు, ఎనిమిదవ కేంద్రాన్ని శ్రీనగర్ కాలనీ పార్క్ వద్ద ఏర్పాటు చేసి 31 నుంచి 34 వ వార్డు వరకు, 9వ కేంద్రాన్ని ఇండిస్టియల్ ఏరియాలోని కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటుచేసి 13 నుంచి 17 వార్డుల వరకు, పదవ కేంద్రాన్ని రాఘవేంద్ర కాలనీలోని కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటుచేసి 35 నుండి 37 వార్డుల వరకు, 11వ కేంద్రాన్ని శివాజీ నగర్ లోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసి 38, 39,40,48 వార్డుల వరకు, 12వ కేంద్రాన్ని జిల్లా పరిషత్ ఎదురుగా గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఏర్పాటుచేసి అక్కడ 41,42,45,46,47 వార్డులకు సంబంధించిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ 12 కేంద్రాలలో మున్సిపల్ సిబ్బందితో పాటు మండల పంచాయతీ అధికారులు ( ఎంపీ వో ) కూడా ఉండనున్నారు. దరఖాస్తు ఫారాలు నల్లగొండ పట్టణంలోని జిరాక్స్ సెంటర్లలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంటున్నారు. దరఖాస్తుదారులు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తుదారులు ఆధార్ కార్డ్, ప్రస్తుతం ఉన్న ఆహార భద్రత కార్డ్, పాత రేషన్ కార్డు జత చేయాలని, ఫోటో తప్పనిసరి కాదని అధికారులు చెబుతున్నారు.
వెనువెంటనే దరఖాస్తుల విచారణ...
ఉదయం నుండి సాయంత్రం వరకు స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు అధికారులు విచారణ చేయనున్నారు. విచారణ కోసం 12 ఎంక్వయిరీ టీంలను ఏర్పాటుచేసి వారికి నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం కూడా పూర్తి చేశారు.
పూర్తికాని నిర్మాణాలు...
నల్లగొండ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ వెనుక భాగంలో పేదలకు నిర్మించ తలపెట్టిన 552 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులు ఇంకా నత్త నడకనే కొనసాగుతూ ఉన్నాయి. కేవలం భవనాలు మాత్రమే నిర్మించబడి ఉన్నాయి. వాటికి కావలసిన మౌలిక వసతులైన విద్యుత్, నీటి వసతి, రోడ్డు సదుపాయం వంటి ఇతరత్రా పనులు ఏవి కూడా నేటికీ పూర్తి కాలేదు. అలాంటప్పుడు డబల్ బెడ్ రూముల పంపిణీ ఎలా సాధ్యం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తిస్థాయిలో అర్హుల పంపిణీకి అందుబాటులోకి రావాలంటే దాదాపు మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని సంబంధిత శాఖకు చెందిన పలువురు ఉద్యోగులే పేర్కొంటూ ఉండటం గమనార్హం.
పైరవీలకు తావు లేకుండా ఎంపిక
జయచంద్ర రెడ్డి (నల్లగొండ ఆర్డీఓ)
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం అర్హులైన పేదలని మాత్రమే ఎంపిక చేస్తాం. ఎలాంటి అవినీతి ఆరోపణలకు, రాజకీయ పైరవీలకు తావు లేకుండా ఎంపిక జరుగుతుంది. ఎవరికి ఎలాంటి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. పట్టణ ప్రజలు ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయాలలో దరఖాస్తులు ఇవ్వరాదు. గృహనిర్మాణ శాఖ ఫార్మేట్లో ఉన్న దరఖాస్తు ఫారంలో మాత్రమే దరఖాస్తు చేయాలి. గడువు పెంచడం ఉండదు. సూచించిన తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి.