Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాలకుర్తి నుంచి పట్నం వరకు జరిగే గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్రకు సంఘీభావంగా సోమవారం నల్లగొండ మండల ఎంపీడీవో కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు 7 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి అనంతరం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 30 ఏండ్ల నుండి గ్రామపంచాయతీ కార్మికులు తమ వయసంత గ్రామ పంచాయతీకి సేవ చేయడానికి వినియోగించినారన్నారు. వారితో ప్రభుత్వం ఎట్టి చాకిరి చేయించుకుని ఇప్పటివరకు కనీస వేతనం అమలు చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ఏండ్లు పోరాడి జీవో నెంబర్ 51ని సాధించుకున్నారని, అంతలోనే మల్టీ పర్పస్ వర్కర్ విధానంతో కార్మికులను కట్టు బానిసలు చేసి కార్మికుల చేత తమకు రాణి పనులు బలవంతంగా చేయిస్తూ వారి మరణాలకు కారణమవుతున్నారన్నారు. ఇలా మరణించిన వారికి ఎలాంటి భద్రత లేదని వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ. సలీం మాట్లాడుతూ బిల్ కలెక్టర్, కారోబార్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి అర్హులైన వారందరిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించాలన్నారు. కార్మికులకు ప్రమాద బీమా, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్ర పట్నం చేరుకునేలోపు సమస్యలు పరిష్కారం చేయకపోయినట్లయితే ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఏర్పుల యాదయ్య, కానుగు లింగస్వామి, దయానంద్, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, భీమగాని, గణేష్, యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్ర అరుణ, పొన్న అంజయ్య, వడ్డేపల్లి యాదయ్య, సలివోదు సైదాచారి, వరికుప్పల ముత్యాలు, కృష్ణ, సంజీవ, చింతకింది భద్రయ్య, రాములు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.