Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులందరికి హక్కు పత్రాలు అందించాలని సీపీఐ(ఎం) మండలకార్యదర్శి అనంతప్రకాష్ డిమాండ్ చేశారు.మండలంలోని చెర్వుతండా గ్రామంలో సీపీఐ(ఎం) శాఖ సమావేశం బానోత్ పాండు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 9 తండాల నుండి 2506 మంది గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే, అందులో 1331 మంది మాత్రమే అర్హులు ఉన్నారని తహసీల్దార్ తమ నివేదికలో పేర్కొన్నారని తెలిపారు.కానీ వివిధ నిబంధనలను ప్రభుత్వం సాకుగా చూపిస్తూ కేవలం 46 మంది గిరిజనులకే హక్కు పత్రాలు ఇస్తామనడం ఏంటని ప్రశ్నించారు.2005 కంటే ముందు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులతో పాటు, ఆ తర్వాత కూడా పోడు భూములను సాగు చేసు కుంటున్న గిరిజన రైతులందరికీ పట్టాలివ్వాలని కోరారు. వామపక్ష పార్టీలు, గిరిజనులు,ఆదివాసీల పోరాట ఫలితంగా 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చిందన్నారు.దానిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నదని విమర్శించారు.ఈ సమావేశంలో మండల నాయకులు బాణావతి రాజు, తరికొండ వెంకటేశ్వర్లు, ఆర్లపూడి వీరభద్రం, శాఖ కార్యదర్శి బానోత్పాండు, బాణావత్ హర్ష, జ్యోతి పాల్గొన్నారు.