Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
వీధి కుక్కల దాడిలో గొర్రెలు చనిపోయి ఆర్థికంగా నష్టపోయిన గొర్రె కాపర్లు బండారు స్వామి, బొంగు నరసింహ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం గ్రామం గొర్రె కాపర్లు బండారు స్వామి,బొంగు నరసింహ మందలో వీధి కుక్కలు దాడి చేసి ఐదు గొర్రెలు 8 పిల్లలను కొరికి చంపేశాయి.మరోఎనిమిది గొర్రెలను గాయపరిచాయి.సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించి గొర్రెల కాపర్ల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకందారులు పోరాడి సాధించుకున్న ఉచిత జీవాల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.గ్రామాల్లో ఉన్న హౌటల్లు,చికెన్ సెంటర్లు,ఫంక్షన్ హాల్ నిర్వాహకులు,ఇతర వ్యాపారులు మిగిలిపోయిన వ్యర్థాలను రోడ్ల పక్కన,వాగులు,చెరువులు,కుంటల్లో పారవేయడం వల్ల వీధి కుక్కలకు ఆహారంగా మారి గణనీయంగా పెరిగిపోతున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల పాలకవర్గాలు వీధి కుక్కల నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన జీవాలకు వైద్య సేవలు అందించిన డాక్టర్ యాకుబ్,గోపాలమిత్ర బృందానికి జీఎంపీఎస్ జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో స్థానిక సొసైటీ అధ్యక్షులు బొంగు రాములు,ఎట్టబోయిన స్వామి,బొంగు పుల్లయ్య,నర్సింహ్మ,బండారు స్వామి,బట్టు మధు,బండారు ఉమేష్,బొంగు రమేష్,యాదగిరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.