Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్, యాప్ ఏర్పాటు
- కుక్కలను పెంచే వాళ్ళు లైసెన్స్ పొందాలి
- మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
మనుషుల ప్రాణాలు తీసే స్థితికి కుక్కల బెడద పెరిగిందని వాటి నివారణ కోసం కావలసిన అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటామని, ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి అన్నారు. కుక్కల నివారణ చర్యలపై గురువారం మున్సిపల్ సమావేశం మందిరంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్కల నివారణ కోసం డంపింగ్ యార్డ్లో ఆపరేషన్ కేంద్రాన్ని కోటి రూపాయలతో ఏర్పాటు చేశామని, అన్ని చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలవకుండా చూస్తామని పేర్కొన్నారు. ఎవరు కూడా ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కుక్కల నివారణకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏర్పాటు చేసిన 14420 టోల్ ఫ్రీ, 08682-200100 కంట్రోల్ రూమ్ నెంబర్కు ఫోన్ చేయవచ్చని, అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న ఏర్పాటు చేసిన యాప్లో సమస్యను అప్లోడ్ చేస్తే మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. కొన్ని కాలనీలలో, హోటల్లు, రెస్టారెంట్లలో అదేవిధంగా చికెన్, మటన్ షాపుల వద్ద వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల కుక్కల బెడద ఎక్కువైందని వాటిని వెంటనే అరికట్టేలా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని, అందుకు కాలనీవాసులు, సంబంధిత యజమానులు సహకరించాలని తెలిపారు. ఇండ్లలో కుక్కల్ని పెంచుకునేవారు విధిగా మున్సిపల్ శాఖ నుండి లైసెన్స్ పొందాలని సూచించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ ఫిర్యాదుల యాప్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి మాట్లాడుతూ ఎన్జీవోల సహకారంతో పట్టణంలోని ముఖ్యమైన కూడలలో, బస్టాండ్, పాఠశాలలో ఫ్లెక్సీలు కరపత్రాలతో అవగాహన కల్పిస్తామన్నారు. వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేయవద్దని చెత్త సేకరణ కోసం నల్లగొండ పట్టణంలో 106 వాహనాలతో సుమారు 800 మంది సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ సుచరిత మాట్లాడుతూ కుక్క కాటుకు గురి అయితే మెదడువాపు, శ్వాస సంబంధిత వ్యాధులు, హైడ్రోఫోబియా మొదలైన వ్యాధులు వస్తాయని తెలిపారు. కుక్క కాటుకు గురి అయితే కుళాయి నీరుతో సబ్బుతో శుభ్రంగా కడగాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పర్యావరణ ప్రేమికులు సురేష్ గుప్తా, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ముసక్ అహ్మద్, మున్సిపల్ శాఖ ఈఈ రాములు, ఏసీపీ నాగిరెడ్డి, డీఈలు వెంకన్న, నరసింహారెడ్డి, అశోక్, పశుసంవర్ధన శాఖ, వైద్యశాఖ, మెప్మా, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.