Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతపల్లి
కేతేపల్లి మండలంలో ఇప్పలగూడెం గ్రామ శివారులో నిర్మించిన గోదాంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంపై, యాసంగి పంట సేకరణ కోసం నిల్వ ఉంచిన గన్ని బ్యాగ్స్ అగ్నిప్రమాదంలో కాలిపోయిన సంఘటనపై వెంటనే ప్రభుత్వం దర్యాప్తు జరపాలని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దైద రవీందర్ డిమాండ్ చేశారు. గురువారం కాలిపోయిన గోడౌన్‌లోని బస్తాలను, బేల్లను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించి మాట్లాడారు. కేతేపల్లి మండలంలోని గుడివాడ ఇప్పలగూడెం శివార్లలో గల వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో యాసంగి వడ్లు సేకరణ కోసం నిల్వ చేసిన దాదాపు 6 లక్షల గన్ని బ్యాగ్స్ అగ్నికి ఆహుతి అయ్యాయన్నారు. ఈ సంఘటన ప్రమాదమా.. లేక రాజకీయ కుట్రనా.. కరెంటు కనెక్షన్ కూడా లేని గోదాముల్లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ ప్రమాదానికి కారకులు ఎవరని వెంటనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగిన స్థానిక ఎమ్మెల్యే గాని, రైతు సమితి సభ్యులు కానీ, మార్కెట్ కమిటీ ఛైర్మెన్గాని, ఘటనాస్థలికి రాలేదంటే రైతులపై , పాలనపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా చిరుమర్తి లింగయ్య ఘటనాస్థలి పరీశీలించి దర్యాప్తు చేపించి యాసంగి వడ్లు రాక ముందే మళ్ళీ బస్తాలు తెప్పించే ఎర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేతేపల్లి పీఏసీఎస్ చైర్మెన్ బోళ్ల వెంకట్ రెడ్డి , కేతేపల్లి ఎంపీపీ పెరుమాళ్ళ శేఖర్, కాంగ్రెస్ పార్టీ కేతేపల్లి మండల అధ్యక్షుడు కంపాసాటి శ్రీనివాస్‌యాదవ్, మాజీ సింగిల్ విండో చైర్మెన్ గార్లపాటి రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ గాజుల ప్రమీల, ప్రభాకర్, మాజీ సర్పంచ్ దోనాల సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ షేక్ లతీఫ్, బయ్య ముత్తయ్య, బచ్చయ్య, నోముల రామకృష్ణ, దాసరి సైదులు, శ్రీను, రవి, సుధాకర్, గడ్డపాటి సతీష్, నాగరాజు, వంటెపాక నక్షత్, సాయి, మహేష్ పాల్గొన్నారు.