Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం
నవతెలంగాణ-మిర్యాలగూడ
మార్చి ఒకటి, రెండు, మూడు తేదీలలో మిర్యాలగూడలో జరిగే తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి కోరారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మహాసభల కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేశారు. హౌసింగ్ బోర్డ్‌లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణి చేసి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రవీంద్ర భారతి వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు రవీంద్ర భారతి గ్రౌండ్లో బహిరంగసభ జరుగుతుందని, దీనికి మాజీ ఎంపీ, ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్, మాజీ ఎంపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ, ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ మీడియం బాబురావు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ధర్మానాయక్, ఆర్.శ్రీరామ్‌నాయక్‌తో పాటు జిల్లా నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. మార్చి 2, 3 తేదీలలో ప్రతినిధుల మహాసభ ఏఆర్సీ ఫంక్షన్ హాల్లో జరుగుతుందని, దీనికి రాష్ట్ర నలు మూలాల నుండి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. బహిరంగ సభకు గిరిజనులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నూకల జగదీశ్ చంద్ర, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆడావత్ చిన వెంకన్న, మాధవరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.