Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గముఖం పట్టిన పత్తిధరలు
- అమ్మలా..వద్దా అనే సందేహం
- ఇండ్లలోనే నిల్వవలు
- రైతుల ఆందోళన
నవతెలంగాణ-పెద్దవూర
వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎంతో కొంత దిగుబడి సాధించినా పత్తి రైతులు పెద్దవూర మండలంలో అమ్ముకోవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. మొన్నటి దాకా గరిష్టంగా రూ.9 వేలు ధర పలికిన పత్తి రోజురోజుకూ తగ్గుముఖం పట్టడమే దీనికి ప్రధాన కారణమని రైతులు అంటున్నారు. దీంతో అమ్ముదామా..ఇంకా కొన్ని రోజులు ఆగుదామా అన్న సందేహంలో రైతులు ఉన్నారు. ఇండ్లల్లోనే పత్తి నిల్వలను ఉంచుకొని అనువైన ధర కోసం వేచి చూస్తున్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటా పత్తిధర రూ.10వేలు పలుకగా క్రమంగా తగ్గుతుండడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో 2,25,859 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా ఎకరాకు 5 నుంచి 6-8క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. ఈసారి నాసిరకం పత్తి గింజలతో రైతులకు కనీస పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దిగుబడి తక్కువగా వస్తుండడం, రోజురోజుకూ ధరలు తగ్గుతుండడం రైతుల్లో ఆందోళన కల్గిస్తుంది. ధర తగ్గడంతో ఎవరింట్లో చూసినా పత్తి నిల్వలే కనిపిస్తున్నాయి. దరపెరగక పోతుందా అని ఎదురు చూస్తూన్నారు. పెద్దవూర మండలంలో ఈసారి పత్తిసాగు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మిర్చికి ధర ఉండడంతో చాలమంది రైతులు అప్పులు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నారు.
పెద్దవూర మండలంలో 32వేల ఏకరల్లో పత్తి సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు చెపుతున్నా ఇంకా అదనంగా మరో 10 వేల ఎకరాల్లో సాగుచేసినట్లు తెలుస్తుంది. ఏపుగా పెరిగినా గూడ పత్తి కాయలు లేకపోవడంతో గూడ రావాలని లక్షలాది రూపాయలు ఎరువులు క్రిమి సంహరక మందులు ఎంత పిచికారీ చేసినా ఫలితం లేక పోవడంతో అప్పులు ఎక్కువయ్యాయని, అప్పులు తీరే మార్గం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో గతేడాది ఈపాటికి సుమారు 3.55 లక్షల క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షా 50వేల క్వింటాళ్లు కూడా విక్రయాలు జరుగలేదంటే పత్తి ఎంత దిగుబడి తక్కువ వచ్చిందో అర్థం అవుతోంది.
దక్కని గిట్టుబాటు ధర..
పత్తి కొనుగోలులో ఉన్న నిబంధనల ప్రకారం తేమశాతం ఉన్న పత్తికే మార్కెట్ నిర్ణయించిన ధర లభిస్తుంది. మధ్యలో క్వింటాకు రూ.9 వేలకు పైగా పలికిన ధర మళ్లీ తగ్గుతోంది. అంతర్జాతీయ విపణిలో బేళ్ల ధర పెరిగి పత్తి వ్యాపారం పుంజుకుంటే పత్తికి ధర పెరిగే వీలుంటుంది. ఇతర ప్రాంతాల్లో కొంత ధర ఎక్కువగా చెల్లిసున్నా ఇక్కడ మాత్రం నాణ్యత పేరుతో ధర తగ్గిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. గతవారం రోజులుగా పత్తి ధరలు క్రమంగా తగ్గుతుంది. పెద్దవూర మండలంలో పదిహేను రోజుల క్రితం పత్తిధర రూ.7,350 ఉండగా రోజుకు రూ.200నుంచి 300వరకు తగ్గుతూ వస్తోంది. గత నెల రోజుల క్రితం ధర రూ.8,050జిన్నింగ్ మిల్లుల్లో ఉండగా గ్రామాల్లోని వ్యాపారులు 6,000 లనుంచి 6,500లు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు నట్టేట మునుగుతున్నారు.
ఇంట్లోనే నిల్వ ఉంచాను..
తగుళ్ళ ఈదయ్య(పెద్డగూడెం, రైతు)
ధర పెరుగుతుందన్న ఆశతో పత్తిని ఇంట్లోనే నిల్వ ఉంచాను. ఏడేకరాల భూమిలో 16క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొదట్లో ధర ఆశాజనకంగా ఉన్నా క్రమంగా తగ్గుతోంది. ధర పెరుగుదల పైనే ఆశలు పెట్టుకున్నాం. ధరలు మరింత తగ్గితే తీవ్రంగా నష్టపోతాం.
నాసిరకం విత్తనాలతో మోసపోయాం
దందిగ సైదులు (తెప్పలమడుగు, రైతు)
ఈసారి నాసిరకం విత్తనాలు విత్తన వ్యాపారులు అంటకట్టారు. 8 ఎకరాలు పత్తి వేస్తే 25 క్వింటాళ్ల పత్తికూడా వెళ్ళలేదు. ఎకరాకు 25వేలు పెట్టుబడి పెట్టాను కనీస పెట్టుబడులు కూడా రాలేదు. ఒకేసారి ధరలు తగ్గడంతో పత్తిని అమ్మాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నాను.