Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండరూరల్
ఎండాకాలం ప్రారంభంలోనే విద్యుత్ కోతలు రైతులకు ఎదురవుతున్నాయని ప్రభుత్వం అధికారులు వెంటనే విద్యుత్ కోతలను నివారించేందుకు తగు చర్యలు చేపట్టాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరు బాలరాజు గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వెల్వర్తి గ్రామంలో స్థానిక సబ్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని ఒకవైపు గొప్పలు చెబుతూ మరోవైపు విద్యుత్ కోతలను విధించడం వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయన్నారు. విద్యుత్ కోతల వల్ల పొట్ట దశలో ఉన్న వరి పొలాలకు సక్రమంగా నీరందకపోవడంతో పంటలో దిగుబడి రాదన్నారు. వెంటనే ప్రభుత్వం అధికారులు విద్యుత్‌ను సక్రమంగా 24 గంటల పాటు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మొగిలిపాక గోపాల్, కందడి సత్తిరెడ్డి, మండల నాయకులు కల్కూరి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు పాల్గొన్నారు.