Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజరుకుమార్ హెచ్చరించారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులో పర్యటించారు. రోగుల కేస్ షీట్లు పరిశీలించి ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిశుభ్రత, వైద్యులు, నర్సుల పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పని తీరు మార్చు కోకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్యూటీ వైద్యులు సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎట్టి పరిస్థితుల్లో బయట మందులు రాయొద్దని, మందుల కొరత ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ ఆస్పత్రిని మరో వంద పడకలు అప్ గ్రేడ్ చేస్తున్నామని, ఇందుకు రూ. 14కోట్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. త్వరలో పనులకు టెండర్ పిలుస్తామని చెప్పారు. సిబ్బంది కొరత అధిగమించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5వేల నర్సింగ్ పోస్ట్లు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి మార్చురీకి మూడు డెడ్ బాడీలు స్టోర్ చేసే ఫ్రీజర్ అందుబాటులోకి వస్తుందన్నారు. రోగులకు నాణ్యమైన బాధ్యతాయూతమైన సేవలు అందించేలా బయో మెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు. ఇతర అభివృద్ధి పనులను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ సమరద్, డాక్టర్లు పుల్లారావు, రాంబాబు, శ్రీకాంత్ సిబ్బంది వేణు, యునస్, అలీ తదితరులు పాల్గొన్నారు.