Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
పట్టణకేంద్రంలోని 30 పడకల ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఏరియాసుపత్రిగా తీర్చిదిద్దాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశం, ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ కోరారు. ఏరియాసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేస్తూ మార్చి 6,7 తేదీల్లో పట్టణంలో 48 గంటలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్న కరపత్రాలను శనివారం పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో వారు విడుదలచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చౌటుప్పల్ చుట్టుపక్కల నాలుగైదు మండలాలకు కేంద్రంగా ఉన్న రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందకపోవడంతో ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. ఆసుపత్రిలో కనీస వసతులు కరువయ్యాయన్నారు. పేద ప్రజలు డబ్బులు ఖర్చుపెట్టి ప్రయివేట్ ఆసుపత్రులకు పోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌చేశారు. 48 గంటల రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షులు సామిడి నాగరాజురెడ్డి, ఎమ్‌డి.ఖాసీమ్, గుండు నర్సింహా, సామిడి జగన్‌రెడ్డి, గుర్రం మల్లారెడ్డి, శంకర్‌రెడ్డి, సుందర్ పాల్గొన్నారు.