Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రభుత్వం సొంత ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహడిమాండ్ చేశారు.శనివారం సుందరయ్య భవన్లో నిర్వహించిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇండ్లు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్స్ ,రేషన్ కార్డులు ఇస్తానని ప్రకటించి ఏండ్లు గడుస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ పథకాలు ఎన్నికల హామీలుగా కాకుండా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలని సూచించారు. మండలంలో ఇల్లు లేని పేదలు వందలాదిగా ఉన్నారన్నారు. బస్వాపురం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు, ముంపునకు గురవుతున్న తిమ్మాపురం ఇతర గ్రామాల ప్రజలకు 100శాతం ముంపు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళ్వేశ్వరం పరిధిలోని బస్వాపురం ప్రాజెక్టు నుండి వివిధ ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోవడానికి తీస్తున్న కాలువల పైన బ్రిడ్జి నిర్మాణాలు చేయకపోవడంతో రైతులు, వత్తిదారులు, ప్రజలు కాలువలు దాటడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా కాలువల పైన బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం మార్చి 1 నుంచి 30 వరకు గ్రామాన పర్యటనలు చేసి సమస్యలను గుర్తించి పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శివర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు మోటె ఎల్లయ్య, కొండపురం యాదగిరి పాల్గొన్నారు.