Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర పెరుగుతుందని గంపడాశతో ఎదురుచూస్తున్న రైతులు
- 4058 ఎకరాల్లో పత్తి పంట సాగు
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ఎండనక వాననక నిరంతరం రైతులు శ్రమించి పంటలు పండించి అమ్ముకుందామంటే సరైన ధరలు లేకపోవడంతో నష్టపోతున్నారు. మండలంలో రైతులు పత్తి అధికంగా సాగు చేశారు. చేతికి వచ్చిన పంట అమ్ముదామంటే మద్దతు ధర లేకపోవడంతో రైతులు పత్తిని ఇండ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు.
ఆలేరు మండలం మెట్ట ప్రాంతం కావడంతో రైతులు వర్షాధారంతో పంటే వాణిజ్య పంట పత్తిని పండించేందుకు మక్కువచూపుతున్నారు. 70 శాతం మంది పత్తి పంటలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ సంవత్సరంలో మండలంలో 4058 ఎకరాల విస్తీర్ణంలో 2100 మంది రైతులు పత్తి పంటను సాగు చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. గతేడాది అధికంగా పత్తి రేట్ ఉండడంతో ఎక్కువ మంది రైతులు పత్తిని సాగు చేశారు. ఈ ఏడాది పత్తి ధర పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల కొనుగోలు గుంటుక కిరాయి ,కలుపుతీత,ఎరువులు పురుగుల మందుల కొనుగోలు పత్తి ఏరడం వంటి ఖర్చులు కలిపి మొత్తం 30 నుండి 40వేల మధ్య ఖర్చు వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం క్వింటాల్ పత్తికి వస్తున్న మద్దతు ధర రూ.6500 పలుకుతుంది పత్తి ఏరినందుకు కూలీలకు కూడా సరిపోవడం లేదని రైతులు దిగులు చెందుతున్నారు. దళారులకు అమ్ముకుంటే వారు తూకం విషయంలో మోసం చేస్తున్నారు.ఆలేరు మండలం తో పాటు శారాజి పేటలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి రేటు పెంచాలని ఆదుకోవాలని కోరుతున్నారు.
పత్తి రైతును ఆదుకోవాలి
బత్తుల నరేందర్ రెడ్డి ,శారాజిపేట రైతు
ఓవైపు అకాల వర్షాలు మరోవైపు పెట్టుబడి ఖర్చులు అధికంగా పెరగడంతో పంట దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల పెట్టుబడి ఖర్చులు ప్రభుత్వ దష్టిలో ఉంచుకొని క్వింటాల్‌కు రూ.10వేలు ఇవ్వాలి.
పత్తి రైతుకు ఆధారం
సుధాగాని నరసమ్మ ,మాజీ సర్పంచ్ శర్బనాపురం
మండలంలోని రైతులు ఎక్కువ పత్తి పంట వేసి దానిమీద జీవనం సాగిస్తున్నారు. పత్తికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలకనుగుణంగా పత్తి రేటు పెంచాలి.
పత్తి క్వింటాకు రూ.10వేలు ఇవ్వాలి
పిక్క గణేష్, సీపీఐ(ఎం) మండల కార్యవర్గ సభ్యులు
పత్తి క్వింటాల్కుమద్దతు ధర లేకపోవడంతో రైతులు పత్తిని ఏరి ఇండ్లల్లోనే పోసుకుంటున్నారు. ధర పెరుగుతుందని రైతులు ఎదురుచూస్తున్నారు. ధర పెరగకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది.