Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించాలి
- పాఠశాలలో పరిశుద్ధ కార్మికుల నియమించాలి
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
ఒకటవ తరగతిలో చేరబోయే విద్యార్థుల వయస్సు 5 ప్లస్ ఒకటిగానే ఉంచాలని, కేంద్ర ప్రభుత్వం 6 ప్లస్ వన్‌గా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని, వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో సీపీిఐ (ఎం) పార్టీ నాయకులు నీల ఐలయ్య కుమార్తె, కుమారుల నూతన పట్టు వస్త్రాల కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిక్స్ ప్లస్ వన్ ఉత్తర్వుల మూలంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉపయోగమేమీ లేదని, కార్పొరేట్ స్కూళ్లకే ఉపయోగమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాలని, ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మన ఊరు- మనబడి మొదటి విడత కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 9123 ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం మే చివరి వరకు అభివద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో 20వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి వెంటనే నోటిఫికేషన్ ఏసి భర్తీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులపై కోర్టు స్టేను ఎత్తివేయింపజేసి ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను ప్రారంభించాలని కోరారు. మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కూడా బదిలీలు పదోన్నతులను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనులను గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల ద్వారా నిర్వహించడం సాధ్యం కావడం లేదని, విద్యాశాఖ నుండే పారిశుధ్య కార్మికులను, సర్వీస్ ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరేషన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నట్లుగా ఏప్రిల్ నుండి అమలు అయేవిధంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. ఆయన వెంట టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కంచి రవికుమార్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సిల్వర్ అనిల్ కుమార్, సీనియర్ నాయకులు బాసర యాదగిరి, లలిత తదితరులు ఉన్నారు.