Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-చిట్యాలటౌన్
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తున్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. చిట్యాల పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక బీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేషనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు రామ్ జీ గౌతమ్‌తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. బీఎస్పీ పేరు వింటేనే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నామని తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేస్తున్న ఇసుక మాఫియా, భూ కబ్జాలకు వ్యతిరేకంగా బీఎస్పీ పోరాడుతుందన్నారు. ఇసుక మాఫియాలో నకిరేకల్, నల్లగొండ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు కలిసి 3500 కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఇందులో ప్రగతి భవన్ వాటా ఎంతో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. 700 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్ర ప్రాజెక్టు ఏండ్లు గడుస్తున్న ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడానికి గల కారణాలను అడిగే దమ్ము స్థానిక ఎమ్మెల్యేకు లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేష్ చౌహన్, గొల్ల నరేష్, జిల్లా అధ్యక్షులు పూజారి సైదులు, మహిళా రాష్ట్ర కన్వీనర్ నర్ర విమల, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి, పోకల ఎలిజబెత్, మండల అధ్యక్షురాలు పూజిత తదితరులు పాల్గొన్నారు.