Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీసీ,రిజిస్ట్రార్లను సస్పెండ్ చేయాలని నిరసన
- ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
నవతెలంగాణ-నల్లగొండ
హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్ మెట్టు సమీపంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్‌ను దారుణంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసిన హరిహరను, కాకతీయ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్‌ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, ఎంఎస్పీ బకరం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో కాకతీయ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన సైఫ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్‌ను ప్రేమ వ్యవహారంలో హత్య చేసిన హరిహరల కిరాతకాలను నిరసిస్తూ ఐక్య విద్యార్థి యువజన సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి నేతలు వెలుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో నాయకులను అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ విద్యార్థిని సైఫ్ వెంటాడిన విధానం, వేధించిన వేధింపులు, బిటెక్ విద్యార్థి నవీన్‌ను హత్య చేసిన విధానం అమానవీయంగా ఉన్నాయని, ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టిన నిందితులను ఫాస్ట్రాక్ ఏర్పాటు చేసి 45 రోజులలోపు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను సరిగ్గా శిక్షించకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలోకి కొంతమంది విద్యార్థులు మత్తు పానీయాలను, గంజాయి, గుట్కాలను సేవిస్తున్నా యూనివర్సిటీ వీసీకి గాని, రిజిస్టార్కుగాని పట్టింపు ఉండదన్నారు. మహాత్మగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లకు బాధ్యత వహిస్తున్న వార్డెన్స్ ఏనాడు కూడా ఇలాంటి విద్యార్థులను నియంత్రించిన దాఖలాలు లేవన్నారు. యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులపై అధ్యాపకులు వేధింపులకు పాల్పడినా.. విద్యార్థినిలపై విద్యార్థులు ఆకృత్యాలకు పాల్పడినా వీసీకి, రిజిస్టార్లకు ఫిర్యాదులు చేసినా ఏనాడూ చర్యలు తీసుకోలేదని తెలిపారు. యూనివర్సిటీ వీసీ, రిజిస్టార్ల నిర్లక్ష్యమే నేడు నవీన్ బలయ్యాడని ఆరోపించారు. కాకతీయ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం ప్రీతి ఆత్మహత్యకు కారణం అయిందన్నారు. దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు ప్రేమోన్మాదుల అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ప్రభుత్వాలు ఈ ఉన్మాదులను కట్టడి చేయడంలో విఫలమయ్యాయని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్‌గౌడ్, టీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా వినరు, కేవీపీఎస్ జిల్లా సహయ కార్యదర్శి గాదే నర్సింహ్మ, బొల్లు రవీందర్, కొంపల్లి రాము, బొజ్జ దేవయ్య, బొలుగూరి నరసింహ, కట్ట వినయ్‌కుమార్ బొల్లెపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.