Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల
నవతెలంగాణ-కేతపల్లి
కేతపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో శనివారం సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న సబ్ స్టేషన్కు ఎక్కువలోడు ఉండటంతో సమస్యతో రైతుల మోటార్లు కాలిపోతున్నాయని చెప్పారు. లోవోల్టేజ్ సమస్యను నివారించేందుకు మండలంలో మరో రెండు 33 కేవీ 11 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యలను నివారించాలని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం 10 గంటలైనా ఇవ్వడం లేదని, నాణ్యమైన కరెంటు కనీసం 18 గంటలైనా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత రబీ సీజన్లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికీ ఇంకా అమలు కాలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే లక్ష రూపాయల రుణమాఫీ రైతులకు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్నవెంకులు, మండల కార్యదర్శి చింతపల్లి మారయ్య, మండల కమిటీ సభ్యులు కోట లింగయ్య, లకపాక రాజు, చెరుకు సత్తయ్య, ఆది మల్ల సుధీర్, కూకుట్ల శోభన్, చెవుగోని నాగయ్య, కర్ర బాలయ్య పాల్గొన్నారు.