Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) బస్సు యాత్ర మార్చి 18న ప్రారంభం
- మార్చి 1 నుండి 3వరకు మిర్యాలగూడలో గిరిజన మహాసభలు
- జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, అందుకు నిరసనగా తెలంగాణలో మార్చి 18 నుండి బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో శనివారం నిర్వహించిన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బస్సు యాత్రలో భాగంగా నల్లగొండ జిల్లాలో జరిగే సభలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమ పథకాలను రోజురోజుకు విస్మరిస్తూ పెట్టుబడిదారులను, కార్పోరేట్ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ దేశంలో ధనవంతులు ఇతర దేశాలలో దోచిపెట్టిన నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పి తొమ్మిదేండ్లు కావస్తున్నా ఆ విషయాన్ని మర్చిపోయి తిరిగి 14 లక్షల కోట్ల రూపాయలు రాయితీ బడా పెట్టుబడిదారులకు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని ప్రతిష్ట పరచాల్సిన మోడీ గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో ఇంకా తగ్గిస్తూ నిధులు కేటాయించడం దుర్మార్గమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చెప్పినట్టుగా నడుస్తుందని, ప్రజల పట్ల ప్రేమ, మమకారం లేదని, హిందూ పేరుతో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఏడు సార్లు అధికారంలోకి వచ్చిన అక్షరాస్యతలో ఆ రాష్ట్రం ఇంకా వెనకబడి ఉందని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఇతర రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం జరిగిందని గుర్తు చేశారు. మతోన్మాద ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజకీయాలను ఓడించాల్సిన అవసరం కమ్యూనిస్టు పార్టీలకు, ప్రజాతంత్ర శక్తులకు ఉందన్నారు. మార్చి నెలలో జరిగే క్యాంపెయిన్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు జరుగుతాయని, గ్రామ గ్రామాన బీజేపీ విధానాలను ఎండగడుతూ ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మార్చి 1న మిర్యాలగూడలో జరిగే గొప్ప బహిరంగ సభను జయప్రదం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో అఖిలభారత నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బృందాకరత్, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, భద్రాచలం పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియం బాబురావు, ఇతర ప్రజాసంఘాల రాష్ట్ర నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, నాగిరెడ్డి, సీహెచ్.లక్ష్మీనారాయణ, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.