Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం నిర్మాణమంటున్న మున్సిపల్ ఆఫీసర్లు
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులతో భవన నిర్మాణ పనులు చేయిస్తుండడం వివాదాస్పదంగా మారింది.రోడ్లు ఊడ్చడం, చెత్త తొలగింపు, చెట్లకు నీళ్లు పోయడం, మురికి కాల్వలు శుభ్రం చేయడం లాంటి పనులు చేయాల్సిన మున్సిపల్ కార్మికులతో భవన నిర్మాణ పనులు చేయించడమేంటని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.ఆదివారం ఉదయం శ్మశానవాటికలో నలుగురు మున్సిపల్ కార్మికులతో ఓ భవన నిర్మాణపనులు చేయిస్తుండడంతో కొందరు నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్కేంద్రంలో రూ.కోటి నిధులతో శ్మశానవాటిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి.శ్మశానవాటికలో చివరన సిమెంట్ ఇటుకలతో నలుగురు కార్మికులు భవన నిర్మాణం చేస్తున్నారు.ఓ కార్మికుడు ఇసుక, సిమెంట్ కలిపి మాల్ అందిస్తున్నారు.మరో కార్మికుడు మాల్ మోసుకెళ్లుండగా ఇద్దరు కార్మికులు నిర్మాణ పని చేస్తున్నారు.మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ కూడా అక్కడే ఉంది.తోటి కార్మికులంతా రోడ్లు ఊడ్చుతూ చెత్తతొలగింపు పనులు చేస్తుండగా ఈ కార్మికులు మాత్రం తాపీ పని చేస్తుండడం గమనార్హం.మున్సిపాలిటీలో ఏ పని చేయాలన్నా కౌన్సిల్ తీర్మానం ఉండాలని, ఏదైనా నిర్మాణం చేపడితే దానికి ఎంత ఖర్చవుతున్నది ఎస్టిమేషన్ వేసి పాలకవర్గం ఆమోదంతోనే పనులు చేయాల్సి ఉంటుందని, మున్సిపాలిటీ పని కాకుండా ఇతర ఏ ప్రైవేట్ పని అయినా కాంట్రాక్టర్ తోనో, ఇతర కార్మికులతోనో చేయించాల్సి ఉండగా మున్సిపల్ కార్మికులతో భవన నిర్మాణ పనులు ఎలా చేయిస్తారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆ స్థలమంతా శ్మశాన వాటికకు కేటాయించి రూ.కోటి నిధులతో పనులు జరుగుతుండగా, శ్మశాన వాటికలో స్వచ్ఛ సర్వేక్షన్ కోసం గదుల నిర్మాణ పనులు ఎలా చేస్తారని నాయకులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కార్మికుల్లో ఎక్కువ శాతం ఎస్సీ సామాజిక వర్గం కార్మికులే ఉన్నారని, వారికొచ్చేదే తక్కువ జీతమని, వారితో మున్సిపాలిటీకి సంబంధం లేని ప్రైవేట్ పనులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని, కొందరిని సొంతానికి డ్రైవర్లుగా కూడా వాడుకుంటున్నారని యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు మందుల సురేష్ ఆరోపించారు. శ్మశాన వాటిక స్థలంలో మున్సిపల్ కార్మికులతో నిర్మాణ పనులు చేయిస్తుండటంతో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు బయ్యని రాజు కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీకి వాట్సప్ ద్వారా ఫొటోలు పెట్టి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
కార్మికులు చేస్తున్నది శ్మశానవాటిక పనులు కాదు
సి.శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్, మోత్కూరు
శ్మశానవాటిక స్థలంలో కార్మికులు చేస్తున్నది శ్మశాన వాటిక నిర్మాణ పనులు కాదు. స్వచ్ఛ సర్వేక్షన్ సీఎన్డీ వేస్ట్ మెటీరియల్ కోసం ఆ నిర్మాణం చేయిస్తున్నాం.బయటి వాళ్లు నిర్మాణం కోసం రూ.20 వేల వరకు అడుగుతున్నారు.కార్మికుల్లో ఎక్కువగా వీకర్ సెక్షన్ వాళ్లు ఉన్నారు.జీతాలు కూడా టైంకు రానందున తాము తక్కువకు చేస్తామంటే రూ.10 వేలిచ్చి వారితో పనిచేయిస్తున్నాం. ఈ రోజు భవన నిర్మాణ వర్కర్లు రానందున ఆ పని కార్మికులు చేస్తామంటే వారితో చేయిస్తున్నాం.