Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్యార్థులు వైజ్ఞానికంగా ఎదగడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని విజ్ఞానదర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు టి.రమేశ్ అన్నారు.సోమవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని చందన స్కూల్లో నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల సైన్స్ పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. వైజ్ఞానికంగా ఎదిగిన విద్యార్థులే భవిష్యత్తులో మానవ ప్రగతిలో ముఖ్య భూమిక పోషిస్తారని తెలిపారు. దేశాభివృద్ధిలో వారే మూలస్థంభాలు అవుతారన్నారు. ఈ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవం అంశంగా ప్రపంచ మేలు కోసం ప్రపంచ సైన్స్ అనే అంశంతో జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నేటి సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర చాలా ఉన్నప్పటికీ సైన్స్ రంగంలో వారి సంఖ్య తక్కువగా ఉండడం బాధాకరమన్నారు. ఇతర దేశాల్లోని మహిళలు సైన్స్ రంగంలో రాణిస్తూ వినువిధుల్లోకి దూసుకెళ్తుంటే భారతదేశ మహిళలు మాత్రం మూఢ నమ్మకాలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సైన్స్ రంగంలో బట్టీ పట్టి చదవడం వల్ల దేనినీ సాధించలేమని తెలిపారు. సైన్స్ మన జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతుందన్నారు. పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు సైన్స్ రంగంలో రావడానికి ఆసక్తి చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞానవర్థిని తెలంగాణ నాయకులు ఎం.ఝాన్సీ, కూరెళ్ల శ్రీనివాస్, టి.శోభ, ప్రిన్సిపాల్ అవ్వారు రామేశ్వరి, గోవర్థన్, ఉపాధ్యాయులు స్వప్న, నర్మద, పద్మ, గీత, రేణుక, అర్చన, జగదీశ్వరి, సౌమ్య పాల్గొన్నారు.