Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకీడు
నూతనంగా ఏర్పడిన పాలకీడు మండల సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరైన వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల నుండి సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలకు సుదీర్ఘకాలంగా చెల్లింపులు ఆగిపోవడం పై అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ, రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సొసైటీలో రైతులకు యూరియాని అందుబాటులో ఉంచాలని, గ్రామాలలో ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని, ఎంపీపీ గోపాల్ నాయక్ వ్యవసాయ అధికారులను కోరారు. రైతుల ధాన్యాన్ని అమ్ము కోవడానికి ముందస్తుగానే చర్యలు చేపట్టాలని, సంబంధిత అంతర్గత రహదారులకు మరమ్మతులు చేయించాలని కోరారు. మండలంలో రైల్వే నిర్మాణంలో రైతులు కోల్పోయిన పంట పొలాలలోని పైపులకు, సర్వే నిర్వహించి రిపోర్టును రైల్వే అధికారులకు పంపించాలని, రెవిన్యూ అధికారి ఎమ్మార్వోకి ఎంపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ప్రభుత్వ హాస్పటల్లో నార్మల్ డెలి వరీలను ప్రోత్సహించాలని, కేసీఆర్ కిట్టు రాక పోవడానికి గల కారణాలను వైద్యాధికారుల నుండి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే అన్ని అధికారిక కార్యక్రమాలకు ఎంపీపీ, జెడ్పీటీసీలకు సమాచారం అందించి, ప్రోటోకాల్ పాటించాలని ఎంపీడీవో కార్యదర్శులకు సూచించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా అస్తవ్యస్తంపై గ్రేట్ అధికారిని సమావేశంలో ప్రజాప్రతినిధులు నిలదీశారు. ట్రైబల్ వెల్ఫేర్ నుండి చెరువు తండా గ్రామానికి పంచాయతీ కార్యాలయం, మరో ఆరు నూతన గ్రామపంచాయతీలకు కార్యాలయాలు శాంక్షన్ అయినట్లు ఎంపీఓ ఉదయాకర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, కుటుంబ సభ్యుల చేర్పులు మార్పులపై తహసీల్దార్‌ను ఎంపీటీసీ ఉపేందర్ వివరణ కోరారు. ఎంపీటీసీ విజయ వెంకట్, కవిత, దొంగల వెంకటయ్య, సర్పంచ్‌లు మోతిలాల్, గౌరీ, భోగాల వీరారెడ్డి లు తమ స్థానిక సమస్యలను ఎంపీ సమక్షంలో అధికారులకు ఏ కరువు పెట్టారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ, వీలున్నంతవరకు మండల సర్వసభ్య సమావేశాలకు హాజరవుతానని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన ఏర్పడటం వలన అసెంబ్లీ, పార్లమెంట్లో ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి అనేక సమస్యలను తీసుకెళ్ళి పరిష్కరించడానికి అవకాశం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బుజ్జి మోతిలాల్, వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్, కోఆప్షన్ సభ్యుడు వాజిద్, పశువైద్యాధికారి శ్రీకాంత్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.