Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియ అరెస్టు అప్రజాస్వామ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వారి విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి దాడులు చేయిస్తుందన్నారు. నిఘా సంస్థలను అడ్డుపెట్టుకొని వారికి అనుకూలంగా లేని వారిపై ఈడీ దాడులు, అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని తెలిపారు. వారికి వ్యతిరేకంగా ఉన్న వ్యాపారులపై ఈ తరహా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అనుకూలంగా ఉన్న కార్పొరేట్ సంస్థలకు ఊతమిస్తూ వారి వ్యాపారాలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. గౌతమ్ అదానిలాంటి వ్యాపార సంస్థలపై అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కనీసం ప్రభుత్వం నోరు మెదపకుండా వదిలేసిందన్నారు. వారికి అనుకూలంగా ఉన్నవారు ఎంత పెద్ద తప్పు చేసిన మద్దతిస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసేందుకు ప్రజల పక్షాన నిరంతరం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే పార్టీలతో పార్టీ పొత్తు ఉంటుందని తెలిపారు.ఆయా నియోజకవర్గాల్లో బీజేపీని బలంగా ఎదుర్కునే శక్తి ఏ పార్టీకి ఉందో ఎన్నికల నాటికి పరిశీలన చేసి పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఒకవేళ బీజేపీని ఎదుర్కునే శక్తి తమ పార్టీకి ఉన్నచోట ఒంటరిగానే ముందుకు వెళ్తామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, మండల కార్యదర్శుల పోసనబోయిన హుస్సేన్, వట్టెపు సైదులు, నాయకులు పిన్నపరెడ్డి వెంకటరెడ్డి, వెంకటనారాయణ, రేపాకుల మురళి పాల్గొన్నారు.