Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరవేగంగా అభివృద్ధి పనులు
- వచ్చే నెల మంత్రి చేత ప్రారంభోత్సవం
- వార్డుల అభివృద్ధికి 10 లక్షల కేటాయింపు
- మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
నల్లగొండలో నలుమూలల అభివృద్ధి జరిగిందని, మరికొన్ని అభివృద్ధి పనులు ఐటీ హబ్, మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్, రహదారుల విస్తరణ, కూడల జంక్షన్, సుందరికరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అవి త్వరలో పూర్తి చేసి వచ్చే నెలలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణంతో పాటు వార్డుల అభివృద్ధికి 10 లక్షల రూపాయల చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు.
నీటి ఎద్దడి, కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలి... కౌన్సిల్ సభ్యులు
వేసవి సమీపిస్తుండడంతో నీటి సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కౌన్సిల్ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మంచినీరు సమయానికి రావడం లేదని, లీకేజీలువచ్చినప్పుడు మూడు రోజుల సమయం పడుతుందనివాటిని నివారించాలని, పాడైపోయిన జనరేటర్లకు మనమత్తులు చేయించాలని కోరారు. కుక్కల నివారణకు నాలుగు టీంలను ఏర్పాటు చేసి నివారణ చర్యలను చేపట్టాలని, పందుల నివారణ కోసం కూడా చర్యలు తీసుకోవాలని వాటి వల్ల వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా స్మశాన వాటికలో కనీస వసతులు కల్పించాలని సరైన వసతి లేక మహిళలు రోడ్డుపైన స్నానాలు చేస్తున్నారని ఆవేదన చెందారు. స్మశాన వాటికల వద్ద స్నానపు గదుల నిర్మాణం నీటి సదుపాయం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని వార్డుల అభివృద్ధికి 15 లక్షల రూపాయలను ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా రంజాన్ మాసం ప్రారంభమవుతున్నందున పట్టణంలోని మదీనా మసీదు వద్ద నిర్మిస్తున్న డ్రైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని, శానిటేషన్ వాహనాలను అందుబాటులో ఉంచాలని, రిపేర్లు వచ్చినప్పుడు ఎక్కువ సమయాన్ని సిబ్బంది తీసుకుంటున్నారని అలా జరగకుండా చూడాలని, రామాలయం వద్ద ప్యాచ్ వర్క్ లను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ కె.వి రమణ చారి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ముసాక్ అహ్మద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, డీఈలు, ఏఈలు, టౌన్ ప్లానింగ్, అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పన్నులను వెంటనే చెల్లించాలి..
పేరుకుపోయిన పన్నుల బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ కేవీ. రమణాచారి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం మున్సిపల్ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి, కులాయి, అడ్వర్టైజ్మెంట్ లైసెన్స్లు, షాపుల పన్నులను వెంటనే చెల్లించాలని కోరారు. పనులు చెల్లించేందుకు నెల మాత్రమే గడు ఉన్నందున వెంటనే చెల్లించాలని కోరారు. పన్నుల చెల్లింపు కోసం ప్రత్యేకంగా ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశామని, వారంతా బకాయి పడ్డ ఇంటి వద్దకు వచ్చి రెడ్ నోటీసులను అందజేస్తారని, అవసరమైతే జప్తు చేసే అవకాశం కూడా ఉందని, ప్రజలు పనులను వెంటనే చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.