Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.20 కోట్ల మేరా టోకరా
- న్యాయం చేయాలని బాధితుల ఆందోళన
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-మిర్యాలగూడ
పొదుపు సంఘాల పేరిట పేద, మధ్యతరగతి ప్రజలను భారీగా మోసం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ చెన్నయ్య, డీఎస్పి వెంకటగిరిలకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డి కుంట, తాళ్లగడ్డ, బంగారుగడ్డ, వినోద్ నగర్, ఈదులగూడ ప్రాంతాలలో సుమారు 3,500 మంది భవిష్యత్తు అవసరాల కోసం స్నేహ పరస్పర సహాయక సహకార పొదుపు, పరపతి సంఘాల సమాఖ్య సంస్థలలో నెలకు రూ.100 చొప్పున పొదుపు చేశారన్నారు. 28 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన సంస్థ తక్కువ కాలంలో చేసిన పొదుపుకు రెట్టింపు ఇస్తామని నమ్మబలికి వారి నుండి పెద్ద ఎత్తున పొదుపు పేరిట డబ్బులను సేకరించారని ఆరోపించారు. మరికొందరి వద్ద ఫిక్స్ డిపాజిట్ పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు కోటి 20 లక్షల రూపాయలకు వసూలు చేసినట్లు గతంలో పోలీసులు ఆడిట్ ద్వారా నిర్ధారించారని చెప్పారు. అప్పట్లో సంస్థ నిర్వాహకులు కృష్ణవేణితో పాటు శంకర్, వేణుగోపాల్, నరేష్ , శ్రీనివాసులపై కేసు నమోదు చేశారని, డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపించారు. ఆరు సంవత్సరాలుగా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని, దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేసిన నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేసి వారి నుండి బాధితులకు డబ్బులు అందించి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఆర్డీఓ, డీిఎస్పీలు మోసం చేసిన వారిపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) వన్ టౌన్ కార్యదర్శి మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, పోలే బోయిన వరలక్ష్మి, చెనగని యాదగిరి, ధైదా బిక్షం, లెంకల మాధవరెడ్డి, ఆకారపు రాములు, రామారావు, బాధితులు నాగమణి, గోవిందమ్మ, అంజమ్మ, దుర్గమ్మ, దేవరబోయిన అంతమ్మ, సుమారు 300 మంది బాధితులు పాల్గొన్నారు.