Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో రిజిస్ట్రార్ ఆచార్య తుమ్మ కృష్ణారావు
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ఇటీవల హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన ఎంజీయూ ఇంజనీరింగ్ విద్యార్థి నేనావత్ నవీన్ హత్యకు కారణమైన వారిని సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని రిజిస్ట్రార్ ఆచార్య తుమ్మ కృష్ణారావు డిమాండ్ చేశారు. సోమవారం ఎంజీ యూనివర్సిటీలో నేనావత్ నవీన్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో విద్యార్థులు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దుశ్చర్యకు ఒడిగట్టిన హంతకులను సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని కోరారు. కొద్ది నెలల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడాల్సిన యువకుడ్ని కోల్పోవడం కుటుంబానికి , విశ్వవిద్యాలయానికి సైతం దురదృష్టకరమని అన్నారు. ఎదిగిన కుమారుని కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆ కుటుంబానికి తమ వంతుగా , వ్యక్తిగతంగా కొంత సహాయాన్ని చేయడానికి సైతం సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు నవీన్‌తో వారికున్న పరిచయాలను అనుబంధాన్ని పంచుకొని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య అల్వాల రవి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రేఖ, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ కే. అంజిరెడ్డి, హాస్టల్స్ డైరెక్టర్ డాక్టర్ కే. ప్రేమ్ సాగర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.