Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ భర్త ఒంటెద్దు పోకడలపై ఆగ్రహం
- వైస్చైర్మెన్తో సహా కౌన్సిల్ కు రాని ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు
- కమిషనర్ కు వినతిపత్రం అందజేసి కాంగ్రెస్ కౌన్సిలర్ల బహిష్కరణ
- చైర్మెన్‌పై అవిశ్వాసం దిశగా కౌన్సిలర్ల కార్యాచరణ..?
- నిజమైన నవ తెలంగాణ కథనం
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. మున్సిపల్ చైర్మెన్ తీపిరెడ్డి సావిత్రి భర్త మేఘారెడ్డి ఒంటెద్దు పోకడలు, వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న కౌన్సిలర్లు మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా బహిష్కరించారు. చైర్మెన్‌తో సహా బీఆర్ఎస్ కౌన్సిలర్లు 9 మంది, కాంగ్రెస్ కౌన్సిలర్లు ముగ్గురు ఉండగా చైర్మెన్ సావిత్రి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ 6వ వార్డు కౌన్సిలర్ వనం స్వామి, 10వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, 12వ వార్డు కౌన్సిలర్ కూరెళ్ల కుమారస్వామి, కోఆప్షన్ సభ్యులు గనగాని నర్సింహ, ఎండి.నబీ మాత్రమే హాజరు కాగా, బీఆర్ఎస్ వైస్ చైర్మన్, 8వ వార్డు కౌన్సిలర్ బొల్లెపల్లి వెంకటయ్య, 1వ వార్డు కౌన్సిలర్ పురుగుల వెంకన్న, 4వ వార్డు కౌన్సిలర్ లెంకల సుజాత, 5వ వార్డు కౌన్సిలర్ మలిపెద్ది రజిత, 9వ వార్డు కౌన్సిలర్ దబ్బెటి విజయ సమావేశానికి రాకుండా బహిష్కరించారు. మరో ఇద్దరు కోఆప్షన్ మెంబర్లు పోలినేని ఆనందమ్మ, ఎండి. షాహిన్ సుల్తానా కూడా సమావేశానికిహాజరుకా లేదు. చైర్మెన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కుక్కలు, కోతుల బెడదను నివారించాలని, డివైడర్ పనులు జరుగుతున్నందున రోడ్డుపై మట్టిని తొలగించాలని, మున్సిపాలిటీ పరిధి ప్రారంభంలో స్వాగత బోర్డులు ఏర్పాటు చేయాలని, డివైడర్‌లో ప్రచార ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లినట్టు తెలిసింది.
కమిషనర్ కు వినతిపత్రం అందజేసి కాంగ్రెస్ కౌన్సిలర్ల బహిష్కరణ
ఇక కాంగ్రెస్ ముగ్గురు కౌన్సిలర్లు 2వ వార్డు కౌన్సిలర్ కారుపోతుల శిరీష, 4వ వార్డు కౌన్సిలర్ ఎర్రవెల్లి మల్లమ్మ, 11వ వార్డు కౌన్సిలర్ గుర్రం కవిత జమా, ఖర్చుల వివరాలు చెప్పాలని, తమ వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ సి.శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేసి సమావేశం బహిష్కరించారు. అంచనా బడ్జెట్ తయారు చేయడంలో కౌన్సిలర్లతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, గత సమావేశాల్లో చేసిన తీర్మానాలు, నిధుల ఖర్చుల వివరాలను సభ్యులకు అందజేయాలని, కూరగాయల మార్కెట్ స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, కస్తూర్బా పాఠశాల వద్ద ఉన్న మినీ స్టేడియం స్థలాన్ని కాపాడి అక్కడే మినీ స్టేడియం నిర్మించాలని, ప్రభుత్వ జూనియర్ కాలేజీ కోసం సీక్రెట్ హార్ట్ స్కూల్ వెనకాల ఉన్న స్థలాన్ని కాపాడాలని, మోత్కూరు పాత ఊరు ప్రాధాన్యాన్ని కాపాడేలా మున్సిపల్ కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించకుండా నూతన భవనం అక్కడే నిర్మించాలని, చెరువు కట్ట వద్ద అసంపూర్తిగా ఉన్న పోతన కళాభవన్ స్థలంలో పార్క్ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. ప్రతిపక్ష కౌన్సిలర్లుగా తమను లెక్క చేయడం లేదని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చైర్మెన్‌పై అవిశ్వాసం దిశగా కౌన్సిలర్ల కార్యాచరణ..?
చైర్మెన్ భర్త మేఘారెడ్డి అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం, కౌన్సిలర్లను లెక్క చేయకుండా చులకన భావంతో అవమానిస్తుండటం, తమ వార్డుల్లో అభివృద్ధి పనులు జరగకుండా బిల్లుల ఆమోదం కోసమే ఛారు, బిస్కెట్ సమావేశాల్లా కౌన్సిల్ సమావేశాలను మార్చారని గత కొంతకాలంగా చైర్మన్ భర్త, కౌన్సిలర్ల మధ్య ముసలం మొదలైంది. చైర్మెన్ భర్తపై నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశాన్ని కౌన్సిలర్లు బహిష్కరించడంతో బహిర్గతమైంది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణలో నిర్వహించగా చైర్మెన్‌తో పాటు పార్టీ శ్రేణులు ముందుగా రాగా చాలా సేపటి తర్వాత అసంతృప్త కౌన్సిలర్లంతా ఒకచోట కలుసుకుని కలిసి వెళ్లారు. చైర్మెన్‌్ భర్త వెంట ఉన్న మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లతో టచ్ లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. చైర్మెన్‌పై అవిశ్వాసం పెట్టడానికి ఐదుగురు బీఆర్ఎన్ కౌన్సిలర్లు ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు కోరనున్నట్టు సమాచారం.చైర్మెన్‌పై అవిశ్వాసం పెట్టే దిశగా కౌన్సిలర్లు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
నిజమైన నవ తెలంగాణ కథనం
చైర్మెన్ భర్త ఒంటెద్దు పోకడలపై కౌన్సిలర్లలో నెలకొన్న అసంతృప్తి తాజా వ్యవహారంతో 'నవ తెలంగాణ' కథనం నిజమైంది. మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి భర్త మేఘారెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ కౌన్సిలర్లలో నెలకొన్న అసంతృప్తిని 'నవ తెలంగాణ' ఫిబ్రవరి 1న ' మున్సిపల్ చైర్మెన్ భర్త వర్సెస్ కౌన్సిలర్లు' అన్న శీర్షికన వెలుగులోకి తెచ్చింది. ఈ కథనాన్ని చైర్మెన్ భర్త గాని, కౌన్సిలర్లు గాని ఖండించలేదు. చైర్మన్ భర్త మేఘారెడ్డి వైస్ చైర్మెన్‌తో సహా కౌన్సిలర్లకు ఫోన్లు చేసినా స్పందించకుండా ఉన్నదే రాశారు. కదా అనికౌన్సిలర్లు తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ కథనాన్ని జీర్ణించుకోలేని చైర్మెన్ భర్త నలుగురు వ్యక్తులను నవ తెలంగాణ రిపోర్టర్ యాదగిరి యాదవ్ ఇంటి మీదకు పంపి దాడి చేయించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు తిరుగు బావుటా ఎగురవేసి చైర్మెన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.