Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి
- రెండో రోజు అంగన్వాడీల సమ్మె
- కలెక్టర్ కార్యాలయం ఎదుట వందలాది మందితో ధర్నా.
నవతెలంగాణ- భువనగిరిరూరల్
కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో రోజైన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట వందలాది మందితో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, ఐసీడీఎస్ కు కేంద్రం బడ్జెట్ పెంచాలని, నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఇఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. కేంద్రం పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. బకాయిపడ్డ టీఏ, డీఏలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. మూడు నెలల పీఆర్సీ ఏరియర్స్ ను వెంటనే ఇవ్వాలన్నారు. టీచర్స్, హెల్పర్స్ ల మధ్యనున్న వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలన్నారు. మినీ టీచర్స్‌ను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ టీచర్స్‌గా గుర్తించాలన్నారు. జిఓ నెం 14, 19, 8 లను వెంటనే సవరించాలన్నారు. వేసవిలో ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్నట్లుగా అంగన్వాడీ సెంటర్స్‌కు వేసవి సెలవులివ్వాలన్నారు. ఎన్హెచ్టీిఎస్ యాప్‌ను పూర్తిగా రద్దు చేసి కేవలం పోషన్ ట్రాకర్ మాత్రమే కొనసాగించాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగులందరికి ఆసరా, కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. మూడు సంవత్సరాలకు సంబంధించిన బియ్యం రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు అంత్యక్రియల సందర్భంగా రూ. 50 వేలు ఇవ్వాలన్నారు. ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలన్నారు. బకాయిపడ్డ ఇంక్రిమెంట్, ఇన్‌చార్జ్జి అలవెన్స్ లు చెల్లించాలన్నారు. ఆరోగ్యలక్ష్మి మెనూ చార్జీలను పిల్లలకు రూ ఐదు, గర్భిణులకు, బాలింతలకు రూ పది రూపాయలకు పెంచాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులతో పాటు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూజిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి పాండు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, చిలువేరు రమాకుమారి, జిల్లా సహాయ కార్యదర్శి బోడ భాగ్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, సీఐటీయూ జిల్లా కమిటీి సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, నాయకులు సంగి రాజు, నాయకులు సఫియా, పద్మ, షాహెద, శోభ, వసంత, జయప్రద, సునిత, భాగ్య, అనురాధ, కళ్యాణి, కవిత, సంతోష, భాగ్యలక్ష్మి, ఉమ, రాధిక, రమ్య, భూలక్ష్మి, జంగమ్మ, జయమ్మ, మాధవి, మంజుల పాల్గొన్నారు.