Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, ఈ విషయంపై ఈరోజే ముఖ్యమంత్రి లేఖ రాస్తానని మాజీ ఎమ్మెల్యే జూలకటి రంగారెడ్డి అన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల సమ్మెలో భాగంగా రెండవ రోజు గురువారం అంగన్వాడీలు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ చెన్నయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిడిలను తగ్గించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకే ఫుడ్ సరఫరా చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు గ్రా డ్యూటీ చెల్లించాలన్నారు. వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పారు. టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేసి ఈ సమస్య పరిష్కార కోసం తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలన్నారు. ఎండకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని తెలిపారు. జీవో నెం 14, 19, 8 లను వెంటనే సవరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్, డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, ఆయూబ్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు పార్వతి నాయకురాలు ప్రమీల, తుడి అరుణ, స్వరాజ్యం బెజ్జం నాగమణి, స్వరాజ్యం, జీ. రజిత, ఝాన్సీ, రాధాబాయి, విజయ, శేషు మని, గౌసియా, చంద్రకళ, మండే వనజ, నాగమణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ కలెక్టరేట్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గడిచిన ఎనిమిది ఏళ్ల పాలనలో ఐసీడీఎస్‌ను పూర్తిగా విస్మరించిందని, 60 శాతానికి బడ్జెట్‌ను తగ్గించిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ విమర్శించారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ కార్యాలయం ముందు గురువారం సమ్మెలో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను ఏ ఒక్కటి నేటికీ పరిష్కరించలేదన్నారు. బడ్జెట్ తగ్గించడం ద్వారా ఐసీడీఎస్ ద్వారా పేద ప్రజలకు అందుతున్న సేవలకు ఆటంకం కలుగుతుందన్నారు. కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ఐసీడీఎస్‌కు ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటిని పరిష్కారం చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసి, పేద ప్రజలతో పాటు, అంగన్వాడీ ఉద్యోగుల ఉపాధికి నష్టం కలిగించే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నర్సింహ్మ, ప్రాజెక్టు నాయకులు కే.విజయలక్ష్మి, ఆర్.మంజుల, బీ.రత్న, పీ.సరిత, పీ. లక్ష్మి, ప్రకృతాంబ, మనిరూప, యాదమ్మ, హేమలత కృపావతి, ఆర్.కళమ్మ, వినోద, రేణుక, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల : అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ బైరం దయానంద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సుబాని, కరీమా తదితరులు పాల్గొన్నారు.