Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బసవ పున్నయ్య
నవతెలంగాణ-మిర్యాలగూడ
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య డిమాండ్ చేశారు. గురువారం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. గ్రామీణ విలేకరులకు మండల కేంద్రంలో పనిచేసే విలేకరులకు తక్షణమే ఇండస్థలాల ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇండ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వ నిధులు పెంచాలన్నారు. ప్రమాదవశాత్తు జర్నలిస్టు మరణిస్తే ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆపదలో ఉన్న జర్నలిస్టులను సంక్షేమ బోర్డు ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టాలని ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమాలు చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైన జీ.వెంకన్న, మనోజ్, మహేష్‌లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఆయూబ్, నియోజవర్గ అధ్యక్షులు మంద సైదులు, జర్నలిస్టులు నామిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాజీముద్దీన్, వాడపల్లి రమేష్, రామకృష్ణ, నాగరాజు, అరుణ్, నాగేందర్, శ్రీనునాయక్, బాబు, హరీష్, వేణు, బాలాజీ, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.