Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూలే అంబేద్కర్ స్పూర్తితో రాజ్యాంగ రక్షణ యాత్రలు
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ-మిర్యాలగూడ
బీజేపీ పాలిత రాష్ట్రాల మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా మతోన్మాద శక్తుల అరాచకాలు పెట్రేగిపోతున్నాయని, ఈ దారుణాలకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సమాజం అడ్డుకట్ట వేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం మిర్యాల గూడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ప్లాన్ ప్రకారం దళితులు బలహీన వర్గాలపై భౌతికంగా మూక దాడులు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఈ దాడులపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్నారు. పౌరసమాజం, ప్రభుత్వం ఐక్యంగా ప్రతిఘటించాలన్నారు. ఒక భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తే పోలీసు స్టేషన్లలోకి చొరబడి వికారాబాద్ జిల్లా యాలాల మండల పోలీసు స్టేషన్లో పోలీసుల సమక్షంలో మూక దాడులకు పాల్పడ్డారని చెప్పారు. హన్మకొండలో బైరీ నరేష్‌పై పోలీసు వెహికిల్‌లోకి జొరబడి పోలీసుల సమక్షంలోనే హత్యాయత్నంకు పాల్పడ్డారని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడి మతోన్మాద శక్తులను అడ్డుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పలన్నారు. పూలే, అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని మార్చి, ఏప్రిల్ మాసాలను మహనీయుల మాసాలుగా పాటించాలని, రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ రక్షణ కోసం రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి బైక్ యాత్రలు పూలే, అంబేద్కర్ జాతరలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. లక్షలాది కరపత్రాలు వేసి దళితులను చైతన్యపరచాలన్నారు. గ్రామ గ్రామాన పూలే, అంబేద్కర్ జయంతుల సందర్భంగా సాంస్కృతి ఉత్సవాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, శ్రమదానాలు, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన వాగ్దానాలైనా దళిత బంధు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వంటి వాటిని అమలు చేయాలన్నారు. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా రాష్ట్ర దినోత్సవాన్ని రాష్ట్రమంతటా జరపాలని చెప్పారు. వరంగల్‌లో జరిగిన గిరిజన వైద్య విద్యార్థి ప్రీతి ప్రీతి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ గ్రేడ్ వన్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రేమిడాల పర్శరాములు, కోడిరెక్క రాధిక, జిల్లా నాయకులు కోడిరెక్క మల్లయ్య, బొల్లెపల్లి పాపారావు, దైద దేవయ్య తదితరులు పాల్గొన్నారు.